Share News

Be Alert Alway అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:42 PM

Be Alert Alway విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.

Be Alert Alway అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల, వసతిగృహాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే ఎంపీడీవో, గ్రామీణ నీటి సరఫరా అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సర్టిఫికెట్‌ మంజూరు చేస్తేనే పాఠశాల, వసతిగృహానికి విద్యార్థుల రావాల్సి ఉంది. ప్రతి పాఠశాల, వసతిగృహాల్లో సిక్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. అనారోగ్యంతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా వంట గది, పాత్రలు శుభ్రంగా ఉండాలి. విద్యార్థులు సబ్బుతో చేతులు శు భ్రపర్చుకునేలా చూడాలి. రోజూ వారికి వైద్య పరీక్షలు చేయాలి.’ అని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఈవో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు

పల్లెల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల్లోని గుంతల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. ఎక్కడైనా సక్రమంగా పారిశుధ్య పనులు చేయకుంటే డిప్యూటీ ఎంపీడీవోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం, క్లోరినేషన్‌ పనులు పూర్తయిన వెంటనే సంబంధిత ఫొటోలను తహసీల్దార్‌కు పంపించాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ కేసులకు పరిహారం చెల్లింపు

జిల్లాలో 46 ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం కింద రూ.48 లక్షలు నష్టపరిహారంగా చెల్లించినట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 15 కేసులకు రూ.14.50 లక్షలు చెల్లించాల్సి ఉందని, ఒక కేసు విచారణ కొనసాగుతుందని తెలిపారు. క్యాస్ట్‌ సర్టిఫికెట్స్‌ పెండింగ్‌లో ఉండడానికి వీలు లేదన్నారు. ఇప్పటివకు లక్షా పది వేలు క్యాస్ట్‌ సర్టిఫికెట్స్‌ మంజూరు చేసినట్లు వెల్లడించారు. భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడిన వివాదాల కారణంగా ఎస్‌సి, ఎస్‌టి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో హేమలత, సబ్‌ కలెక్టర్‌ వైశాలి, ఏఎస్పీ అంకిత సురానా, పాలకొండ డీఎస్పీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:42 PM