Basic symptoms of cancer in 50 thousand people 50 వేల మందిలో క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:56 PM
Basic symptoms of cancer in 50 thousand people జిల్లాలో ప్రాథమికంగా 50 వేల మందిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించామని నాన్ కమ్యూనల్ డీసీజెస్ జిల్లా ప్రోగ్రం అధికారి వీవీబీ సుబ్రహ్మణ్యం తెలిపారు. కొత్తవలస పీహెచ్‌సీకి బుధవారం వచ్చిన ఆయన పీహెచ్‌సీ వైద్యాధికారి సీతల్ వర్మతో కలసి విలేకరులతో మాట్లాడారు.
50 వేల మందిలో క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు
జిల్లా ప్రోగ్రాం అధికారి సుబ్రహ్మణ్యం
కొత్తవలస, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాథమికంగా 50 వేల మందిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించామని నాన్ కమ్యూనల్ డీసీజెస్ జిల్లా ప్రోగ్రం అధికారి వీవీబీ సుబ్రహ్మణ్యం తెలిపారు. కొత్తవలస పీహెచ్‌సీకి బుధవారం వచ్చిన ఆయన పీహెచ్‌సీ వైద్యాధికారి సీతల్ వర్మతో కలసి విలేకరులతో మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన 15 లక్షల మందికి ఏడు రకాల పరీక్షలు చేయడం ద్వారా గర్భాశయ ముఖద్వారం, నోటి, బ్రెస్ట్ క్యాన్సర్ రోగులను గుర్తించామన్నారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ద్వారా మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్, ఓమిని బాబా క్యాన్సర్ ఆసుపత్రి, విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి పంపిస్తున్నామన్నారు. కొత్తవలస ప్రాంతంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టుకు చెందిన ఉప్పలపాటి విజయశ్రీ క్యాన్సర్ ఆసుపత్రిని కూడా రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు.
- జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వైద్యపరీక్షల్లో 50 వేల మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి తరువాత తదుపరి పరీక్షలను నిర్వహించగా 3, 500 మందిలో వ్యాధి తీవ్రత ఉందన్నారు. జిల్లాలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం రెండోసారి స్ర్కీనింగ్ చేస్తామని చెప్పారు. రాష్ట్ర కౌమార సురక్ష కార్యక్రమం ద్వారా 10 నుంచి 12 సంవత్సరాలకు చెందిన బాలికలకు ఆరోగ్య అవసరాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్రీయ బాల స్వస్థతా కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య సిబ్బంది ద్వారా తనిఖీలు చేస్తామని, ఏమైనా అనారోగ్య సమస్యలు గుర్తిస్తే ముందుగా వైద్యాధికారి పరీక్షిస్తారని, ఇంకా అవసరం అనుకుంటే కమ్యూనిటీ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రికి పంపించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో వైద్య సిబ్బంది సన్యాశినాయుడు, అప్పలకొండ, సూరిదేముడు, బేబిరాణి, నిర్మల, జేటి ప్రసాదరావు తదితరులు ఉన్నారు.