బది‘లీలలు’
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:28 AM
ఉమ్మడి జిల్లాలో చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకున్నాయి.
- కోరుకున్నది ఒకస్థానం.. కేటాయించింది మరోస్థానం
- ఉత్తర్వులు చూసి ఖంగుతిన్న సచివాలయ ఉద్యోగులు
- సిఫారసులకే పెద్దపీట వేశారని గగ్గోలు
- కొన్ని విభాగాల్లో అమలుకాని నిబంధనలు
-సమస్యను విన్నవించుకునేందుకు కలెక్టరేట్‌కు రాక
విజయనగరం కలెక్టరేట్, జూలై 9(ఆంధ్రజ్యోతి):
సాలూరు మండలం కరకవలస సచివాలయంలో వెటర్నీ అసిస్టెంట్‌గా పని చేస్తున్న చుక్క మణికంఠ ఐదేళ్ల సర్వీసు పూర్తి కావడంతో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాచిపెంట, మక్కువ, రామభద్రపురం మండలాల్లో పోస్టింగ్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ, ఆయనకు ఈ మూడు మండలాల్లో కాకుండా జామి మండలం లోట్లపల్లి సచివాలయానికి బదిలీ చేస్తూ అధికారులు ఉత్వర్తులు ఇచ్చారు. గతంలో వెటర్నీ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైనప్పుడు మణికంఠకు 47 ర్యాంకు వచ్చింది. ఇప్పుడు బదిలీలకు వచ్చే సరికి ఆయన కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి నచ్చిన స్థానం కేటాయించారు. దీంతో మణికంఠ తన సమస్యను కలెక్టర్‌కు చెప్పుకోవడానికి గత రెండురోజులు నుంచి కలెక్టర్‌రేట్ చుట్టూ తిరుగుతున్నారు. బదిలీల్లో కనీసం నిబంధనలు పాటించకుండా సిఫారసులకు పెద్దపీట వేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లిమర్ల మండలంలోని ఓ సచివాలయానికి చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ బదిలీపై గుర్ల మండలానికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్ సమయంలో గుర్ల మండ లంలోని ఆనందపురం సచివాలయాన్ని ఆయన కోరుకున్నారు. దీంతో ఆ స్థానాన్ని అధికారులు ఓకే చేశారు. అయితే, బదిలీ ఉత్వర్తుల్లో మాత్రం ఆనందపురం కాకుండా మరో సచివాలయం పేరు ఉండడంతో సదరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఖంగుతిన్నారు. తన సమస్యను చెప్పుకోవడానికి బుధవారం కలెక్టరేట్‌కు వచ్చారు.
తెర్లాం మండలం బి.చిన్నయ్యపేట సచివాలయంలో ఐదేళ్ల పాటు పని చేసిన ఓ మహిళా డిజిటల్ అసిస్ట్టెంట్ స్పౌజ్ కోటా కింద విజయనగరం మండలానికి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా విజయనగ రంలో ఉంటున్నారు. దీంతో విజయనగరం సొంత మండలం కింద వస్తుందని, వేరే మండలానికి దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో ఆమె బొండపల్లి మండలం గొట్లాం సచివాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆమెకు గొట్లాం కాకుండా కనిమెరక సచివాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం కనిమెరక సచివాలయంలో ఓ మహిళ డిజిటల్ అసిస్ట్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె ఇక్కడకు వచ్చి నాలుగు నెలలే అయ్యింది. ఈమె రిక్వెస్టు బదిలీకి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తనకు స్పౌజ్ కోటా అవకాశం రాకుండా పోయిందని బి.చిన్నయ్యపేట సచివాలయ మహిళా డిజిటల్ అసిస్ట్టెంట్ ఆవేదన చెందుతున్నారు.
కొత్తవలస మండలం తుమ్ముకాపల్లి సచివాలయంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఓ అగ్రికల్చర్ అసిస్ట్టెంట్ బదిలీ కోసం ఎల్.కోట మండలానికి దరఖాస్తు చేసుకున్నారు. గత నెలలో కౌన్సెలింగ్ జరగ్గా ఎల్.కోట మండలం జమ్మాదేవిపేట సచివాలయాన్ని ఆ అగ్రికల్చర్ అసిస్ట్టెంట్ కోరుకున్నారు. కానీ, మంగళవారం రాత్రి విడుదలైన ఉత్వర్తుల్లో మాత్రం జమ్మాదేవిపేట కాకుండా, మెంటాడ మండలంలోని ఓ సచివాలయం పేరు ఉంది. దీంతో తన సమస్యను కలెక్టర్‌కు విన్నవించుకోవడానికి అగ్రికల్చర్ అసిస్ట్టెంట్ బుధవారం వచ్చారు.
ఉమ్మడి జిల్లాలో చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకున్నాయి. బదిలీల కౌన్సెలింగ్‌లో ఉద్యోగులు ఒక సచివాలయాన్ని కోరుకుంటే, ఉత్తర్వుల్లో మాత్రం మరో సచివాలయం పేరు ఉంటుంది. దీంతో సంబంధిత ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బదిలీల్లో నిబంధనలు పక్కన పెట్టి సిఫారసులకు పెద్దపీట వేసినట్లు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 664 గ్రామ, 134 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో 5,452 మంది పని చేస్తున్నారు. 726 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకేచోట ఐదు సంవత్సరాలు పని చేసిన వారు 3,571 మంది ఉన్నారు. వీరంతా సొంత మండలానికి కాకుండా ఇతర మండలాలకు బదిలీ కావాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అయితే, వ్యవసాయం, పశుసంవర్థక, పోలీసుశాఖ, ఇంజనీరింగ్, పంచాయతీరాజ్ తదితర విభాగాల్లో నిబంధనలు సక్రమంగా అమలు కాలేదని సంబంధిత ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. కౌన్సెలింగ్ సమయంలో వారు కోరుకున్న స్థానాన్ని పక్కన పెట్టి, వేరే చోటకు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి, గతంలో వారికి వచ్చిన ర్యాంకులను పరిగణనలోకి తీసుకుని మొదటి ప్రాఽధాన్యత ఇవ్వాలి. కానీ, ప్రజాప్రతినిధుల సిఫారసులు ఉన్నవారికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ విభాగానికి సంబంధించి మొదటిలో ఇచ్చిన బదిలీ ఆర్డర్‌లో ఓ స్థానం ఉంటే, రాత్రికిరాత్రే మరో చోటును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో ఆయా ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. దత్తిరాజేరు మండలంలోని ఓ సచివాలయంలో పని చేస్తున్న ఓ అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోకపోయినా ఆయనకు పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురానికి బదిలీ చేశారు. బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసేందుకు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చారు.
మహిళా పోలీసుల నిరసన
గత నెల 30న జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని మహిళా పోలీసుల ఆరోపించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్పౌజ్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న సుమారు 170 మంది మహిళా పోలీసులకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలన చేయకుండా వారికి కావాల్సిన స్థానాలు కేటాయించారని అన్నారు. జీవో నెంబరు 5 ప్రకారం సొంత మండలాల్లో పోస్టు ఇవ్వకూడదని, కానీ, చాలామందికి సొంత మండలాలనే కేటాయించారని ఆరో పించారు. అన్ని విభాగాల ఉద్యోగులకు గతంలో వారికి వచ్చిన జిల్లా ర్యాంకు ప్రకారం బదిలీలు చేశారని, కానీ, మహిళా పోలీసుకు మాత్రం స్టేట్ ర్యాంకును పరిగణనలోకి తీసుకోవడంతో తమకు అన్యాయం జరిగిందన్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.