Share News

మొండి బకాయిలు రూ.89 కోట్లు

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:13 AM

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)కి గత పదేళ్ల నుంచి మొండి బకాయిలు వేధిస్తున్నాయని, వీటి వసూలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు బ్యాంకు చైర్మన్‌ కిమిడి నాగార్జున తెలిపారు.

మొండి బకాయిలు రూ.89 కోట్లు
మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ నాగార్జున

- చెల్లించనివారి ఆస్తులు వేలం వేస్తాం

- డీసీసీబీ చైర్మన్‌ నాగార్జున

విజయనగరం రూరల్‌, ఆగస్టు 29 ( ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)కి గత పదేళ్ల నుంచి మొండి బకాయిలు వేధిస్తున్నాయని, వీటి వసూలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు బ్యాంకు చైర్మన్‌ కిమిడి నాగార్జున తెలిపారు. శుక్రవారం బ్యాంకు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ నెల 31 నాటికి రూ.89 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. వసూలు కోసం సిబ్బంది శ్రమిస్తున్నారు. బకాయిదారులకు డీసీసీబీ నోటీసులు ఇచ్చింది. వారు స్పందించకుండా బ్యాంకు బ్రాంచ్‌లు, పీఏసీఎస్‌లకు వెళ్లి సిబ్బందిని బెదిరిస్తున్నట్టు నాకు సమాచారం వచ్చింది. ఇటువంటివి ఉపేక్షించేది లేదు. ఇటువంటి వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయి. పార్టీలతో సంబంధం లేకుండా, ఎంతటివారైనా తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీతో సహా బ్యాంకులకు బకాయిలు చెల్లించాల్సిందే. లేదంటే బ్యాంకు నిబంధనల ప్రకారం వారి ఆస్తులు వేలం వేసేందుకు కూడా వెనుకాడం. సెప్టెంబరు 30లోగా బకాయిలు చెల్లించాలి. లేదంటే అక్టోబరు 1 నుంచి క్షేత్రస్థాయిలో మరో పర్యాయం నోటీసులు ఇచ్చి వారి ఆస్తులు వేలం వేస్తాం. డీసీసీబీ అనుబంధ బ్రాంచ్‌ల్లో వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు అందిస్తాం. వాణిజ్య బ్యాంకులతో పోల్చితే డీసీసీబీ వాటి అనుబంధ శాఖల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు నిర్వహించే వ్యాపారాలకు బ్యాంకు ద్వారా రుణాలు విస్తృతంగా అందజేస్తాం.’అని తెలిపారు.

ఆర్థికంగా పీఏసీఎస్‌ల బలోపేతం

క్షేత్రస్థాయిలో ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలను మరింత బలోపేతం చేయనున్నట్టు డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున తెలిపారు. గ్రామాల్లో కూడా సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా సూర్య ఘర్‌ యోజన కింద పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు మంజూరు చేస్తామన్నారు. పీఏసీఎస్‌లకు చెందిన స్థలాల్లో వాణిజ్య సముదాయాలతో పాటు, పెట్రోలు బంకులు, చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తామన్నారు. తద్వారా పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - Aug 30 , 2025 | 12:13 AM