Ayurveda.. ఆయుర్వేదం.. గిరిజనులకు దూరం
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:28 AM
Ayurveda.. Out of Reach for Tribals సీతంపేట మన్యంలో గిరిజనులు ఆయుర్వేద వైద్యం పొందలేకపోతున్నారు. అవగాహన లేని కారణంగా సేవలకు దూరమవుతున్నారు. వాటి పై చైతన్యపర్చాల్సిన ఆ శాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో సీతంపేటలో ఆయుర్వేద ఆసుపత్రి ఉందనే సమాచారం చాలామంది ఆదివాసీలకు తెలియదు.

కానరాని శిబిరాలు
దీర్ఘకాలిక వ్యాధులతో గిరిపుత్రులు సతమతం
పట్టించుకోని ఆ శాఖ అధికారులు
సీతంపేట రూరల్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో గిరిజనులు ఆయుర్వేద వైద్యం పొందలేకపోతున్నారు. అవగాహన లేని కారణంగా సేవలకు దూరమవుతున్నారు. వాటి పై చైతన్యపర్చాల్సిన ఆ శాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో సీతంపేటలో ఆయుర్వేద ఆసుపత్రి ఉందనే సమాచారం చాలామంది ఆదివాసీలకు తెలియదు. కేవలం సీతంపేట గ్రామస్థులు మాత్రమే ఆ వైద్య సేవలు పొందుతున్నారు. వాస్త వంగా ఐటీడీఏ పరిధిలోని అధిక శాతం గిరిజనులు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. రక్తహీనత, పక్షవాతం, క్షయ, వెన్నెముక, తలనొప్పి, జ్వరం, కీళ్లవాతం, గ్యాస్ర్టిక్ వంటి సమస్యలతో సతమవుతున్నారు. వాటికి ఆయుర్వేద వైద్యంలో సైడ్ ఎఫెక్ట్స్ చూపని మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిపై అవగాహన లేక పోవడంతో సీతంపేట ఆయుర్వేద ఆసుపత్రికి రోజుకి ఐదుగురుకు మించి రావడం లేదు. ఒక్క సోమవారం మాత్రమే 10మంది వరకు ఓిపీ ఉంటుంది. కాగా ఈ ఆసుపత్రిలో సుమారు 50 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
వెంటాడుతున్న సమస్యలు
సీతంపేటలో ఉన్న ఆయుర్వేద ఆసుపత్రికి శాశ్వత భవనం లేదు. ఐటీడీఏకు చెందిన ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ మూడు పోస్టులకు గాను కాంపౌండర్ పోస్టును ఎన్నో ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. ఈ సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్య సేవలు విస్తరింపచేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
సంతల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తే..
మండలంలో ప్రతి వారంలో సీతంపేట, కుసిమి, దోనుబాయి, పూతికవలస, మర్రిపాడు వంటి ప్రాంతాల్లో వారపుసంతలు జరుగుతుంటాయి. అనేక ప్రాంతాల నుండి గిరిజనులు వస్తుంటారు. ఇటు వంటి సంతల్లో ఆయుర్వేద శిబిరాలను ఏర్పాటు చేసి సంతకు వచ్చే గిరిజనులకు అవగాహన కల్పిస్తే వారికి ఈ సేవల పై నమ్మకాన్ని కలిగించవొచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో మృత్యువాత పడుతున్న గిరిజనులను కూడా కాపాడొచ్చు.
వైద్యాధికారి ఏమన్నారంటే...
ఆయుర్వేద వైద్యంపై వారపు సంతల్లో అవగాహన కల్పిస్తామని వైద్యాధికారి బి.నందనసాయిరెడ్డి తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సీతంపేట ఆయుర్వేద ఆసుపత్రికి ఎక్కువగా వస్తారని చెప్పారు.