Share News

Personal Hygiene వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:06 AM

Awareness for Students on Personal Hygiene పాఠశాల దశలోనే విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తున్నట్టు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లావాసులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, వాటి ప్రగతిని పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన సీఆర్‌ఎం బృందంతో బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు.

 Personal Hygiene  వ్యక్తిగత పరిశుభ్రతపై  విద్యార్థులకు అవగాహన
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, నవంబరు5(ఆంధ్రజ్యోతి): పాఠశాల దశలోనే విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తున్నట్టు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లావాసులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, వాటి ప్రగతిని పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన సీఆర్‌ఎం బృందంతో బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..‘ వ్యక్తిగత పరిశుభ్రత లోపం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నట్టు గుర్తించాం. ఈ నేపథ్యంలో ప్రతి అంగన్‌వాడీ, పాఠశాల, కళాశాలల్లో ‘ముస్తాబు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తరగతి గదికి ఇద్దరు లీడర్లను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పరిశుభ్రంగా ఉన్నారా? లేదా! అని పరిశీలించేలా చర్యలు చేపట్టాం. శుభ్రతలో ఫెయిల్‌ అయిన వారు తరగతి గది బయట ముస్తాబయ్యేలా ఏర్పాటు చేశాం. మధ్యాహ్న భోజనానికి ముందు.. ఆ తర్వాత, బాత్‌రూమ్‌కు వెళ్లొచ్చిన తర్వాత విద్యార్థులు చేతులు కడుక్కునేలా చూస్తున్నాం. ఇకపోతే పరిసరాల పరిశుభ్రత లోపం కారణంగా నే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా ప్రబలుతున్నట్లు గుర్తించాం. అధికంగా కేసులు నమోదువుతున్న గ్రామాల్లో ‘మన ఊరికి మలేరియా వచ్చింది’ అనే కార్యక్రమం చేపడుతున్నాం. దీనిద్వారా గిరిజనులను పరిశుభ్రతపై చైతన్యపరుస్తున్నాం. దోమల నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నాం.’ అని తెలిపారు. కొమరాడ మండలంలోని పీహెచ్‌సీ, ఆరోగ్య సంరక్షణ, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించనట్టు కేంద్ర, రాష్ట్ర బృంద సభ్యులు కలెక్టర్‌కు వివరించారు. గ్రామస్థులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న ఆరోగ్య సేవలపై అభిప్రా యాలను సేకరించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి జి.నాగభూషణరావు, ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

15 రోజులకొకసారి కళాజాతర

బెలగాం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రతిభావంతులైన, ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు కళాజాతర కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి 15 రోజులకొకసారి సాంస్కృతిక పోటీలు, ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు మన్యంలో కళాకారులు తమ వివరాలను అధికారులకు అందజేయాలని సూచించారు.

నేడు సచివాలయాల్లో ‘కౌశలం ట్రయల్‌ రన్‌’

కౌశలం (వర్క్‌ ఫ్రమ్‌ హోం) అమలుకు సంబంధించి నేడు జిల్లాలోని 350 గ్రామ, వార్డు సచివాలయాల్లో ట్రయల్‌ రన్‌ పరీక్ష నిర్వహించనున్నారని కలెక్టర్‌ వెల్లడించారు. డ్వామా పీడీ రామచంద్రరావు ట్రయల్‌ రన్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:06 AM