Panchayats ఉత్తమ పంచాయతీలకు అవార్డులు
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:23 PM
Awards for Best Panchayats జిల్లాలో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు పారిశుధ్య పక్షోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు పారిశుధ్య పక్షోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పారిశుధ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదు. వ్యాధుల వ్యాప్తికి కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను తడి, పొడిగా వేరుచేయాలి. ఇందుకు అవసరమైన డస్ట్‌బిన్‌లను ప్రజలకు పంపిణీ చేయాలి. సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలి. మురుగు కాలువల్లో పూడికలు తీయించి బ్లీచింగ్ జల్లాలి. గ్రామ కమిటీ తీర్మానంతో పనులు చేపట్టాలి. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలి. మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, మండల వైద్యాధికారులు తప్పనిసరిగా పీహెచ్‌సీలను సందర్శించాలి. మలేరియా కేసులు లేకుండా చూడాలి. పీ-4 సర్వేలోని అభ్యంతరాలను స్వీకరించి త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.’ అని తెలిపారు.
ఎరువుల కొరత లేకుండా చూస్తాం
సీతానగరం: ఖరీఫ్ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తామని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. కాశీపేట గ్రామంలో రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. కౌలు రైతులకు కౌలు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎకరా భూమికి భాస్వరం, నత్రజని వాడే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వరి నారుమడిని పరిశీలించారు. నవధాన్యాల సాగు ప్రయోజనాలను రైతుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మరిపివలసలో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్, సీతానగరం, బలిజిపేట మండలాల ఏవోలు, తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఎంపీడీవో ప్రసాద్, డీఈవో రాజ్‌కుమార్ ఉన్నారు.