ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:06 AM
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో కిరాయి లేక తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ నాయకుడు బలసా శ్రీను డిమాండ్ చేశారు.
రామభద్రపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో కిరాయి లేక తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ నాయకుడు బలసా శ్రీను డిమాండ్ చేశారు. శనివారం రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన జీవో -21ను రద్దుచేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన ప్రభుత్వ హామీ నెరవేర్చాలని కోరారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు 19న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ అజురఫీ జాన్‌కు వినతిపత్రం అందించా రు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు లోకేష్, వెంకటేష్, రామకృష్ణ, సోములు, మురళీ, రాజు, శ్రీను, అప్పారావు, లెంక మురళి పాల్గొన్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు హెచ్చరించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శనివారం ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు సహాయం అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు పాల్గొన్నారు.