ఆటో డ్రైవర్ల ఆనందం
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:49 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూత అందించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- వారి ఖాతాల్లో రూ.15వేలు జమ చేసిన ప్రభుత్వం
- వాహన నిర్వహణ కోసం ఉపయోగిస్తామని వెల్లడి
భోగాపురం/లక్కవరపుకోట/బొబ్బిలిరూరల్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూత అందించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద వారి ఖాతాల్లో రూ.15వేలు చొప్పున ప్రభుత్వం శనివారం జమచేసింది. ఈ పథకం కింద జిల్లాలో 15,417 మంది డ్రైవర్లకు రూ.23.21 కోట్లు లబ్ధిచేకూరింది. కష్టకాలంలో ప్రభుత్వం తమను ఆదుకుందంటూ డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నగదును ఆటోకి బీమా, టైర్లు, ఫిట్‌నెస్ తదితర వాహన నిర్వహణ కోసం ఉపయోగిస్తామని వారు చెబుతున్నారు.
బీమాకు ఉపయోగిస్తా
కూటమి ప్రభుత్వం రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బుతో ఆటోకి బీమా, టైర్లు, తదితర వాహన నిర్వహణ పనులకు ఉపయోగిస్తాను. ఎన్నికల హామీలో లేనప్పటికీ మమ్మల్ని ఆదుకోవడం ఆనందాన్నిచ్చింది.
-కింతలి శివ. పక్కి గ్రామం, బొబ్బిలి
=========
ఆటో నిర్వహణకు వెచ్చిస్తా
ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ఈ రోజు నా ఖాతాలో రూ.15 వేలు జమయ్యాయి. ఈ డబ్బును ఆటో నిర్వహణ ఖర్చుల కోసం ఉపయోగించుకుంటాను. ఆర్థికంగా ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు.
-మరిశర్ల శ్రీనివాసరావు, కలవరాయి, బొబ్బిలి
============
ఫైనాన్స్‌కు జమ చేస్తా
ఇదివరకూ నేను రోజుకి రూ.1500 వరకూ సంపాదించేవాడిని. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మాకు తీరని కష్టాలు ఎదురయ్యాయి. రోజుకి కనీసం రూ.500 కూడా సంపాదించలేకపోతున్నాం. ముఖ్యమంత్రి మా ఆటో డ్రైవర్లందరికీ దేవుడిలా ఈ ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ డబ్బుని ఆటో ఫైనాన్స్‌కి కొంత జమ చేస్తాను. మిగతాది ఆటో నిర్వహణ ఖర్చులకు ఉపయోగిస్తాను.
-గలావిల్లి అప్పారావు, జగన్నాథపురం, బొబ్బిలి
================
సీఎంకు కృతజ్ఞతలు
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటోవాలాలకు రూ.15వేలు వేయడం సాహసోపేత నిర్ణయం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా డబ్బులు వేయడం సంతోషంగా ఉంది. ఇటువంటి నేత రాష్ట్రానికి అవసరం. సీఎంకు కృతజ్ఞతలు.
-గోకేడ తాతారావు, ఆటో డ్రైవర్, కల్లేపల్లి స్టాండ్, లక్కవరపుకోట
================
సరైన సమయంలో నగదు జమ
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకంతో నా ఆటోకు గిరాకీ తగ్గింది. దీంతో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నా. ఆటోకు ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ చేయించుకోవలిసి ఉంది. వీటికోసం అప్పు చేద్దామనుకున్నా. సరైన సమయంలో ప్రభుత్వం రూ.15వేలు జమ చేయడం సంతోషంగా ఉంది.
-బోనెల ప్రభుదేవా, ఆటో డ్రైవర్, భోగాపురం
================
ఆనందంగా ఉంది
మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలకు బేరాలు తగ్గాయి. అయినా కుటుంబ పోషణ కోసం ఆటో నడుతున్నా. రోడ్డుపై వాహనం నడపాలంటే అన్ని పత్రాలు ఉండాలి. లేదంటే పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ చేయించేందుకు అప్పు చేద్దామనుకున్నా. ఈ సమయంలో నగదు జమచేయడం ఆనందంగా ఉంది.
కోరాడ రాము, ఆటోడ్రైవర్, కొంగవానిపాలెం, భోగాపురం