Share News

Housewarming! గృహయోగం!

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:30 AM

Auspicious Time for Housewarming! జిల్లాలోని గృహ నిర్మాణ లబ్ధిదారుల కోసం సర్వే కొనసాగుతోంది. 15 మండలాలు, రెండు పురపాలక సంఘాలతో పాటు ఒక నగర పంచాయతీలో అర్హులను ఎంపిక చేస్తున్నారు. వచ్చేనెల 4వ తేదీ వరకు అధికారులు ఈ సర్వే కొనసాగించ నున్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయనున్నారు.

 Housewarming!  గృహయోగం!

  • వచ్చేనెల 5 వరకు ఎంపిక ప్రక్రియ

పార్వతీపురం, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గృహ నిర్మాణ లబ్ధిదారుల కోసం సర్వే కొనసాగుతోంది. 15 మండలాలు, రెండు పురపాలక సంఘాలతో పాటు ఒక నగర పంచాయతీలో అర్హులను ఎంపిక చేస్తున్నారు. వచ్చేనెల 4వ తేదీ వరకు అధికారులు ఈ సర్వే కొనసాగించ నున్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయనున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై-2.0 పథకం కింద ఇళ్ల మంజూరుకు గతంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో జిల్లాలోని 15 మండలాల్లో 23,190 మందిని అర్హులుగా గుర్తించారు. బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ పరిధిలో లేని గ్రామాల్లో 4,500 మందిని కూడా అప్పట్లో లబ్ధిదారులుగా గుర్తించారు. కానీ కేంద్ర ప్రభుత్వం బుడా పరిధిలో లేని లబ్ధిదారులకు పీఎంఏవై-2.0 కింద ఇళ్లు మంజూరు చేసేందుకు అంగీకరించలేదు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించడంతో తాజాగా అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సర్వే చేపడుతున్నారు. బుడా పరిధిలో లేని 4,500 మందికి ఇళ్లు మంజూరుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట మండలాల్లో బుడా పరిధిలో లేని గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఇటీవల రీ సర్వే చేసి గతంలో అర్హులుగా ఉన్న 4,500 మందిని లబ్ధిదారులుగా నిర్ధారించారు. కాగా వచ్చేనెల నాలుగో తేదీ వరకు సర్వే గడువు పొడిగించడంతో అర్హుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సాలూరు, పార్వతీపురం, పాలకొండలో 584 మందిని అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి ఇప్పటికే అధికారులు నివేదికను పంపించారు. కానీ జిల్లాలో రెండు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీ మూడో కేటగిరీలో ఉండడంతో ఆయా చోట్ల అర్హులకు మూడో దశలో ఇళ్లు మంజూరు చేస్తారు. వారికి పీఎంఏవై-2.0 పథకం ఇళ్ల నిర్మాణానికి రూ.2,50,000 మంజూరు చేస్తారు. కాగా బుడా పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ప్రస్తుతం రూ.1,80,000 అందిస్తున్నారు. మిగతా రూ.70 వేలు మంజూరు చేస్తారా ? లేదా అన్నది సందేహంగా మారింది.

అదనపు సాయం కోసం ఎదురుచూపు

జిల్లాలో పీఎం జన్‌మన్‌ కింద 5169 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిల్లో 4,169 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 523 గృహ నిర్మాణాలు పూర్తి కాగా 758 శ్లాబ్‌ లెవెల్‌లో ఉన్నాయి. బీఎల్‌ లెవెల్‌లో 1764, ఆర్‌ఎల్‌ లెవెల్‌లో 1,115 , మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కాగా పీవీటీజీకి సంబంధించి మధ్యలో నిలిచిన ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం అదనంగా రూ.లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించింది. దీనికోసం గిరిజన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

నాలుగో తేదీ వరకు సర్వే

ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అర్హులైన వారిని గుర్తిస్తాం. నవంబరు 4వ తేదీ వరకు సర్వే నిర్వహిస్తాం. పీవీటీజీలకు ప్రభుత్వం మంజూరు చేసే అదనపు సాయం రూ.లక్ష లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమవుతుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించుకున్న వారికి నిధులు మంజూరవుతాయి.

- పి.ధర్మచంద్రారెడ్డి, ఇన్‌చార్జి మేనేజర్‌, గృహ నిర్మాణశాఖ

Updated Date - Oct 23 , 2025 | 12:30 AM