Celebrations శుభకార్యాలకు వేళాయే..
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:42 PM
Auspicious Time for Celebrations శుభకార్యాలకు వేళయ్యింది. జిల్లాలో వివాహాల సందడి మొదలు కానుంది. శ్రావణమాసం నేపథ్యంలో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి బాజాలు మోగ నున్నాయి. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో జిల్లావాసులు శుభ కార్యాలకు సన్నద్ధ మవుతున్నారు.
మోగనున్న పెళ్లి బాజాలు
నవంబరు వరకు మంచి ముహూర్తాలు
గరుగుబిల్లి/పాలకొండ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): శుభకార్యాలకు వేళయ్యింది. జిల్లాలో వివాహాల సందడి మొదలు కానుంది. శ్రావణమాసం నేపథ్యంలో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి బాజాలు మోగ నున్నాయి. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో జిల్లావాసులు శుభ కార్యాలకు సన్నద్ధ మవుతున్నారు. గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఇతరత్రా శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివాహాలకు సంబంధించి ఈ నెల 26 నుంచి 31 వరకు, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అయితే భాద్రపద మాసం ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకు శుభ ముహూర్తాలు లేవు. ఈ నేపథ్యంలో శ్రావణమాసంలో అధికంగా శుభ కార్యాలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లావాసులు కల్యాణ మండపాలను బుక్ చేసుకున్నారు. మేళతాళాలు, బ్యాండ్లు, డీజేలు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, నిత్యావసర సరుకులు, పూలు, వంట వారికి అడ్వాన్సులు చెల్లించే శారు. మరోవైపు వస్త్ర, బంగారు, స్వీట్లు తదితర షాపులన్నీ కిటకిటలాడనున్నాయి. మొత్తంగా ఈ నెల 25 నుంచి వ్యాపారాలు ఊపందుకోను న్నాయి. దీంతో పలువురికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ఇవీ శుభ ముహూర్తాలు ..
ఈ నెల 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, సెప్టెంబరు 24, 26, 27, 28, అక్టోబరు 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31, నవంబరు 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండి తులు చెబుతున్నారు. ఈ తేదీల్లో శుభకార్యాలు చేసుకోవచ్చని పాలకొండ కోటదుర్గమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ తెలిపారు.