మొండి బకాయిదారుల ఆస్తుల వేలం
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:11 AM
జిల్లాలో సంవత్సరాల తరబడి రుణ బకాయిలు (పారుబాకీలు) చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై కొరడా ఝుళిపించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అధికారులు రంగం సిద్ధం చేశారు.
- రంగం సిద్ధంచేసిన డీసీసీబీ అధికారులు
- పేరుకుపోయిన రూ.89 కోట్ల బకాయిలు
విజయనగరం టౌన్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంవత్సరాల తరబడి రుణ బకాయిలు (పారుబాకీలు) చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై కొరడా ఝుళిపించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు మొండి బకాయిదారుల ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి బకాయిదారుల జాబితాను తయారు చేశారు. ఆస్తి జప్తు నోటీసులు జారీ చేసినా చాలా మంది రుణ గ్రహీతలు ఖాతరు చేయడంలేదు. దీంతో విసిగి వేసారిన బ్యాంకు ఉన్నతాధికారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో బకాయిదారుల ఆస్తులను వేలం వేసేందుకు న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో రూ.89 కోట్ల పారుబాకీలు పేరుకుపోయాయి. ఈ బాకీలను చెల్లించాలని రుణ గ్రహీతల చుట్టూ సంబంధిత సహకార బ్యాంకు అధికారులు కాళ్లరిగేలా తిరుగుతున్నా రాజకీయ పలుకుబడితో బకాయిలు చెల్లించకుండా వారు తప్పించుకుంటున్నారు. దీంతో బకాయిదారుల ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా 4,350 మంది బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు బ్యాంకు నిరర్దక ఆస్తుల విలువ (ఎన్‌పీఏ) శాతం పెరిగిపోతోంది. దీంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 2025 మార్చి 31వ తేదీ నాటికి 4.96 శాతం ఉన్న ఎన్‌పీఏ, జూన్ నాటికి 5.42 శాతానికి పెరిగింది. బ్యాంకు లాభాల బాటలో నడుస్తున్నా పెరుగుతున్న నిరర్దక ఆస్తుల విలువ వల్ల బ్యాంకు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పారుబాకీలను వసూలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో రికవరీ చేయాలని నిర్ణయించారు.
ఆస్తులు వేలం వేస్తాం
జిల్లాలో పారు బాకీలను చెల్లించని బకాయిదారుల ఆస్తులను వేలం వేస్తాం. దీనికి సంబంధించి న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా, మొండి బకాయిదారులందరికీ నోటీసులు జారీ చేస్తున్నాం. ఇప్పటికే జప్తు నోటీసులను జారీచేశాం. అయినప్పటికీ చాలా మంది స్పందించడంలేదు. దీంతో బకాయిదారుల ఆస్తులను వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.
-సీహెచ్.ఉమామహేశ్వరరావు, సీఈవో, డీసీసీబీ, విజయనగరం