Share News

Attack on police పోలీసులపై దాడి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:58 AM

Attack on police గుర్ల మండలంలోని జమ్ము గ్రామంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు స్థానికులు పోలీసులను భయపెట్టారు. రాళ్లు, చెప్పులు విసురుతూ మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో పోలీసులు ఏం చేయలేక సీఆర్‌పీఎఫ్‌ ఫోర్స్‌కు సమాచారం ఇచ్చారు.

Attack on police పోలీసులపై దాడి
రాళ్లదాడిలో ధ్వంసమైన పోలీస్‌ కారు అద్దం

పోలీసులపై దాడి

జమ్ములో ఆదివారం రాత్రి ఉత్కంఠ

రాళ్లు, చెప్పులు విసిరిన వైనం

25 మందిపై కేసు

గుర్ల, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): గుర్ల మండలంలోని జమ్ము గ్రామంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు స్థానికులు పోలీసులను భయపెట్టారు. రాళ్లు, చెప్పులు విసురుతూ మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో పోలీసులు ఏం చేయలేక సీఆర్‌పీఎఫ్‌ ఫోర్స్‌కు సమాచారం ఇచ్చారు. నిమిషాల్లో పోలీసులను రక్షించేందుకు ప్రత్యేక దళాలు రంగప్రవేశం చేశాయి. వివరాల్లోకి వెళితే.. దేవి నిమజ్జనం సందర్భంగా జమ్ముగ్రామంలో శనివారం రాత్రి గొడవ జరిగింది. ఈ విషయం తెలిసి గ్రామానికి చేరుకున్న పోలీసుల పట్ల స్థానికులు కొందరు దురుసుగా ప్రవర్తించారు. దాడికి ప్రయత్నించారు. నిందితులను గుర్తించిన పోలీసులు విచారించేందుకు ఆదివారం రాత్రి మరోసారి గ్రామానికి వెళ్లగా మళ్లీ దాడి చేశారు. సర్పంచ్‌ నరసింహమూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు నిందితులను రమ్మని కోరారు. అంతలో మహిళలు, కొంతమంది యువకులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. పోలీస్‌ వాహనాలను రాళ్లతో కొట్టారు. దీంతో కానిస్టేబుళ్లతో పాటు సీఐకు దెబ్బలు తగిలాయి. పరిస్థితి అదుపు తప్పడంతో వారు సీఆర్‌పీఎఫ్‌ బలగాలకు సమాచారం ఇచ్చారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న దళాలు 25 మందిని గుర్తించి వారిని స్టేషన్‌కు తరలించాయి. వారందరిపై ఎస్‌ఐ నారాయణరావు కేసు నమోదు చేశారు.

ఎంతటివారైనా ఉపేక్షించం: ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో ఉండే పోలీసు విధులను, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ హెచ్చరించారు. జమ్ము గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొంత మంది వ్యక్తులు దాడులకు పాల్పడడం, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల్లో ఎంత మంది ప్రమేయం ఉన్నా, ఎంతటివారినైనా ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.

తిరుగుబాటును సహించేది లేదు: చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు

రాజ్యాంగ వ్యవస్థలపై తిరుగుబాటు చేస్తే సహించేదిలేదని చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు అన్నారు. సోమవారం గుర్ల పోలీసు స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. గొడవకు కారణమైన వారిని, పోలీసులపై తిరగబడ్డ వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నామన్నారు. ఇప్పటికే సర్పంచ్‌తో పాటు మరో 24 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. పోలీసులపై దాడిచేస్తే ఎంతటివారినైనా వదలిపెట్టేది లేదన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ నారాయణరావు ఉన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:58 AM