సాలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:41 PM
భూక్రయ, విక్రయదారులు, స్థిరాస్తి, విలువ ధ్రువపత్రం, జనన, మరణ, వివాహ రిజిస్ట్రేషన్లతో నిత్యం బిజీగా ఉండే సాలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం గురువారం కళ తప్పింది.
నిలిచిన రిజిస్ట్రేషన్లు
- అధికారులు సెలవులో ఉండడమే కారణం
సాలూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): భూక్రయ, విక్రయదారులు, స్థిరాస్తి, విలువ ధ్రువపత్రం, జనన, మరణ, వివాహ రిజిస్ట్రేషన్లతో నిత్యం బిజీగా ఉండే సాలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం గురువారం కళ తప్పింది. సబ్ రిజిస్ట్రార్ వీవీ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ డీటీవీ రమణమూర్తి సెలవులో ఉండడంతో కార్యాలయంలో సేవలు నిలిచిపోయాయి. ఈ కార్యాలయంలో జరిగే వివిధ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ప్రతిరోజూ రూ.3లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆదాయం వస్తుంటుంది. గురువారం మాత్రం ఈ ఆదాయం రాలేదు. ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్ రామలక్ష్మిపట్నాయక్‌ను వివరణ కోరగా.. ‘సబ్ రిజిస్ట్రార్ నాగరాజుకు సెలవు మంజూరు చేశాం. సీనియర్ అసిస్టెంట్ బీటీవీ రమణమూర్తి అకస్మాత్తుగా సెలవుపై వెళ్లారు. జిల్లాలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక అధికారిని సాలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపించాం. అక్కడ ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో ఆయన తిరిగి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.’అని ఆమె తెలిపారు.