Referee! రాత్రి అయితే రెఫరే!
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:15 PM
At Night, It’s the Referee! డివిజన్ కేంద్రం పాలకొండ ఏరియా ఆసుపత్రి ద్వారా రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
రోగులకు పూర్తిస్థాయిలో అందని వైద్యసేవలు
పాలకొండ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): డివిజన్ కేంద్రం పాలకొండ ఏరియా ఆసుపత్రి ద్వారా రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వారికి వైద్యం అందడం గగనమవుతోంది. అత్యవసర వేళల్లో పొరుగు జిల్లాకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. మరోవైపు రాత్రి వేళల్లో వచ్చే కేసులను అత్యధికంగా రిఫరల్ చేస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
పాలకొండ ఏరియా ఆసుపత్రి ఏజెన్సీకి ముఖద్వారంగా ఉంది. మైదాన, గిరిజన ప్రాంతాల నుంచి నిత్యం రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, సరుబుజ్జిలి, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల నుంచి కూడా రోగులు ఇక్కడకి వస్తుంటారు. విజయనగరం జిల్లాలోని రేగిడి ఆమదాలవలస, వంగర, మండలాల వాసులు, మన్యం జిల్లా పరిధిలోని పాలకొండ, ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేట, భామినితో పాటు వీరఘట్టం, జియ్యమ్మవలస తదితర మండలాల ప్రజలు ఈ వంద పడకల ఆసుపత్రినే ఆశ్రయిస్తారు. మూడు జిల్లాల ప్రజలకు పాలకొండ ఏరియా ఆసుపత్రి పెద్దదిక్కుగా ఉన్నప్పటికీ.. రోగులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. రోజూ ఇక్కడకు వచ్చే రోగుల సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటుంది. ఇన్‌పేషెంట్లుగా ఉండేవారి సంఖ్య 80 నుంచి వంద వరకు ఉంటుంది. వీరికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఓ వైపు వైద్యుల కొరత వేధిస్తుండగా.. చిన్నపాటి రోగానికి కూడా ఆసుపత్రికి వచ్చే వారికి భరోసా ఇవ్వకుండా శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేస్తుండడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా కొంతమంది వైద్యులు ఓపీ మధ్యలోనే ప్రైవేట్ క్లినిక్‌లకు పరుగులు తీస్తున్నారనే విమర్శలున్నాయి. వీటన్నింటిపై పర్యవేక్షించేవారే కరువయ్యారు. మరోవైపు రోగులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం పరుగులు తీయాల్సి వస్తోంది. కొంతమంది వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొన్ని సందర్భాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.చిరంజీవరావును వివరణ కోరగా.. ‘ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. క్రిటికల్‌గా ఉన్న కేసులను మాత్రమే రిఫరల్ చేస్తున్నాం. మరింత నాణ్యమైన వైద్యసేవలందించేందుకు వైద్య సిబ్బందితో కలిసి సమష్టిగా పనిచేస్తాం.’ అని తెలిపారు.
వైద్యులు, సిబ్బంది ఇలా..
స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు జనరల్ పిజీషియన్లు అవసరం. ప్రస్తుతం ఇక్కడ రెండు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. కనీసం ఒక్క వైద్యుడు కూడా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో రేడియాలజిస్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో వివిధ రకాల స్కానింగ్‌ల కోసం వచ్చే రోగులకూ అవస్థలు తప్పడం లేదు. ఇద్దరు మత్తు వైద్యులు అవసరం కాగా ఇక్కడ ఒక్కరు మాత్రమే ఉన్నారు. ముగ్గురు గైనకాలజిస్ట్‌లకు ఇద్దరు వైద్యులే ఉన్నారు. సివిల్ సర్జన్ , స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.