Share News

At a Snail’s Pace! నత్తనడకన!

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:15 AM

At a Snail’s Pace! జిల్లా వ్యాప్తంగా ఈ క్రాప్‌ నమోదు నత్తనడకన సాగుతోంది. జూలై నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పూర్తికాకపోవడంపై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

 At a Snail’s Pace! నత్తనడకన!
ఈ క్రాప్‌ నమోదు చేస్తున్న దృశ్యం

  • వేధిస్తున్న సాంకేతిక సమస్యలు

  • జిల్లాలో 3.20 లక్షల ఎకరాల లక్ష్యం

  • ఇప్పటివరకు నమోదైంది 2.80 లక్షల ఎకరాలు

  • సమీపిస్తున్న గడువు ఆందోళనలో రైతులు

పాలకొండ, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఈ క్రాప్‌ నమోదు నత్తనడకన సాగుతోంది. జూలై నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పూర్తికాకపోవడంపై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2.80 లక్షల ఎకరాలకు సంబంధించి ఈ క్రాప్‌ నమోదు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మన్యంలో 3.20 లక్షల ఎకరాల్లో ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది. కాగా క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో మాదిరిగా వెబ్‌ల్యాండ్‌లో చూసి నమోదు చేయడం కుదరడం లేదు. మరోవైపు వ్యవసాయ సహాయకులు పంట భూములను పరిశీలించి ఈ క్రాప్‌ నమోదు చేయాల్సి ఉండడంతో ఈ ప్రక్రియ మరింత జాప్యమవుతుంది. కాగా ఈ నెలాఖరకు ఈ క్రాప్‌ నమోదు కార్యక్రమం పూర్తి కావాలని వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యవసాయ సహాయకులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సాంకేతికపరమైన సమస్యలు ఎదురవుతున్నా వాటిని అధిగమించి క్షేత్రస్థాయిలోకి వెళ్లి వ్యవసాయ, ఉద్యాన పంటల నమోదుకు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనా వెబ్‌ల్యాండ్‌, సాంకేతిక సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తేనే ఈ క్రాప్‌ నమోదు వేగవంతమయ్యే అవకాశం ఉంది. లేకుంటే ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవడం కష్టమేనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌పాల్‌ను వివరణ కోరగా..‘ జిల్లాలో ఈ-క్రాప్‌ నమోదు ఈ నెలాఖరులోగా పూర్తి కావాలి. ఈ మేరకు వ్యవసాయ సహాయ కులకు ఆదేశాలు జారీ చేశాం. వారి పరిధిలో ఉన్న పంట భూములకు సంబంధించి ఈ క్రాప్‌ నమోదు త్వరగా పూర్తి చేయాలని సూచించాం. ’ అని తెలిపారు.

Updated Date - Oct 18 , 2025 | 12:15 AM