Share News

At a Snail’s Pace! నత్తనడకన!

ABN , Publish Date - Oct 08 , 2025 | 10:58 PM

At a Snail’s Pace! ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన విధానం అమలులోకి తెచ్చింది. జాబ్‌కార్డుల్లో ఎంతమంది సభ్యులు ఉంటే ఆ మేరకు ఈకేవైసీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

At a Snail’s Pace! నత్తనడకన!
తోటపల్లిలో ఈకేవైసీ చేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు (ఫైల్‌)

  • 11 వరకు గడువు పొడిగింపు

  • నమోదు ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం

గరుగుబిల్లి, అక్టోబరు8(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన విధానం అమలులోకి తెచ్చింది. జాబ్‌కార్డుల్లో ఎంతమంది సభ్యులు ఉంటే ఆ మేరకు ఈకేవైసీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పరిధిలోని 15 మండలాల్లో ఈనెల 1 నుంచి ఈకేవైసీ నమోదు ప్రారంభమైంది. అయితే ఈ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది.

ఇదీ పరిస్థితి..

- వాస్తవంగా గతంలో వేతనదారుల ఆధార్‌ కార్డుకు ఆనుసంధానం చేసేవారు. అయితే ‘ఉపాధి’లో అధికంగా అవకతవకలు నెలకొంటున్న దృష్ట్యా నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వాస్తవంగా పలు గ్రామాల్లోని వేతనదారులు పనులకు హాజరుకాకున్నా ఉపాధి క్షేత్ర సహాయకులు మస్తర్లలో పేర్లు వేసి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వలసలు వెళ్లిన వారితో పాటు మృతుల పేర్లును వేసి జేబులు నింపుకుంటున్న సంఘటనలు నెలకొన్నాయి. సామాజిక తనిఖీల్లో బయటపడినా అంతంత మాత్రంగానే చర్యలు ఉండడంతో తాజాగా ఈకేవైసీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉపాధి క్షేత్ర సహాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

- జిల్లాలో 4,05,769 మంది వేతనదారులు ఉన్నారు. ఇందులో ఆధార్‌కార్డుకు అనుసంధానం అయిన వారు 4,04,166 మంది ఉన్నారు. గత ఎనిమిది రోజులుగా 15 మండలాల పరిధిలో 2,46,341 మందికి సంబంధించి ఉపాధి క్షేత్ర సహాయకులు, మేట్లు ఈకేవైసీ నిర్వహించారు. ప్రధానంగా ఈ నెల 9లోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా ఈకేవైసీ నత్తనడకన కొనసాగుతుంది. సమయం ఆసన్నమవుతున్నా ప్రక్రియ వేగవంతం కాకపోవడంపై క్షేత్ర సహాయకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి సహాయంగా టెక్నికల్‌ అసిస్టెంట్లను నియమించారు. ఈనెల 11 వరకు గడువు పొడిగించారు.

ఈకేవైసీ కాకుంటే ఇబ్బందే..

జాబ్‌కార్డుల్లోని వేతనదారులకు ఈకేవైసీ కాకుంటే తదుపరి పనుల్లో పాల్గొనే అవకాశం లేదు. దాదాపుగా రద్దయ్యే అవకాశం ఉంది. ముఖ హాజరుకు అంతంత మాత్రంగానే స్పందన వస్తుంది. వలసలు వెళ్లిన వారికి సమాచారం అందించే ప్రయత్నంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ముఖ హాజరు 50 శాతం దాటని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో ముఖ హాజరు పూర్తయితేనే తదుపరి వేతనదారులకు చెల్లింపులు జరిగే పరిస్థితి ఉంది. ముఖ హాజరు లేనివారికి పనులు కల్పనతో పాటు వేతనాలు కూడా అందవు.

లక్ష్యాలు చేరుకోని వారిపై చర్యలు

పంచాయతీల పరిధిలో వేతనదారులకు ముఖ హాజరు లక్ష్యాలను చేరుకోని వారిపై చర్యలు తప్పవు. వలసలు వెళ్లిన వేతనదారులకు సమాచారం అందించాలి. లేకుంటే ఆయా ప్రాంతాలకు వెళ్లి ముఖ హాజరు చేయాలి. ముఖ హాజరుతోనే వేతనాలు చెల్లింపు జరగనుంది. మండలా లవారీగా ముఖ హాజరును ఈ నెల 11లోగా పూర్తి చేయాలి. ఈకేవైసీ ప్రక్రియ వేగవంతానికి సిబ్బందిని నియమించాం.

- కె.రామచంద్రరావు, పీడీ, డ్వామా, పార్వతీపురం మన్యం

Updated Date - Oct 08 , 2025 | 10:58 PM