At a Rapid Pace… శరవేగంగా..
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:41 PM
At a Rapid Pace… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పర్యటన నేపథ్యంలో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం భామిని ఆదర్శ పాఠశాల వద్ద చేపడుతున్న పనులను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షించారు. సభా వేదిక, హెలీప్యాడ్, ఇతరత్రా పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదే శించారు.
బిజీబిజీగా అధికార యంత్రాంగం
పర్యవేక్షించిన కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
భామిని, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పర్యటన నేపథ్యంలో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం భామిని ఆదర్శ పాఠశాల వద్ద చేపడుతున్న పనులను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షించారు. సభా వేదిక, హెలీప్యాడ్, ఇతరత్రా పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదే శించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. గురువారం రాత్రి మంత్రి లోకేశ్, శుక్రవారం సీఎం చంద్రబాబు జిల్లాకు రానున్నారని చెప్పారు. వారిద్దరూ భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించే మెగా పీటీఎంలో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. మోడల్ స్కూల్ సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలను సమన్వయపర్చుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సభా వేదిక వద్ద ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మరోవైపు హెలీప్యాడ్, సమావేశ ప్రాంగణం తదితర ఏర్పాట్లను జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పరిశీలించారు.
కట్టుదిట్టమైన సెక్యూరిటీ..
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సభావేదిక, మోడల్ స్కూల్ ప్రాంగణం, హెలీప్యాడ్ ప్రాంతాన్ని భద్రత బలగాలు నిశితంగా పరిశీలించాయి. అనంతరం కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో భద్రత సిబ్బంది చర్చించారు. అమరావతి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి సెక్యూరిటీ సైతం జిల్లా యం త్రాంగానికి తగు సూచనలు ఇచ్చారు. మరోవైపు మన్యం జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులు చేరు కున్నారు. చుట్టపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పడుతున్నారు. సుమారు 1500 మంది పోలీసులుతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు బత్తిలి ఎస్‌ఐ అప్పారావు తెలిపారు. ఏడుగురు డీఎస్పీలు, 24 మంది సీఐలు, 51 మంది ఎస్‌ఐలు, 700 మంది సివిల్ కానిస్టేబుల్స్, ఏపీపీ ఎస్‌సీ సిబ్బంది 722 మంది విధుల్లో ఉంటారని వెల్లడించారు. డాగ్ స్క్వాడ్‌తో ఆదర్శ పాఠశాల చుట్టుపక్కలు తనిఖీలు చేపడుతున్నామన్నారు.