Assumed Charge! కొలువుదీరారు!
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:25 AM
Assumed Charge! మెగా డీఎస్సీలో కొలువు సాధించి, శిక్షణ పొందిన కొత్త గురువులు సోమవారం విధుల్లో చేరారు. తమకు కేటాయించిన పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజు విద్యార్థులకు పాఠాలు బోధించి తమ కలను సాకారం చేసుకున్నారు.
పాఠశాలల్లో విద్యార్థులకు బోధన
సాలూరు రూరల్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో కొలువు సాధించి, శిక్షణ పొందిన కొత్త గురువులు సోమవారం విధుల్లో చేరారు. తమకు కేటాయించిన పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజు విద్యార్థులకు పాఠాలు బోధించి తమ కలను సాకారం చేసుకున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 34 మండలాల్లో అన్ని మేనేజ్‌మెంట్‌ల్లో మొత్తం 578 మంది పోస్టింగ్‌లు పొందారు. కాగా 266 ఎస్జీటీలు, పాఠశాల సహాయకుల విభాగంలో సోషల్ స్టడీస్ 67, ఫిజిక్స్ 56, బయాలజీ 36, గణితం 33, తెలుగు 14, హిందీ 14, ఆంగ్లం 30, ఫిజికల్ డైరెక్టర్ 62 పోస్టులకు సంబంధించి కొత్త గురువులకు పాఠశాలలను కేటాయించారు. నిర్ణీత వ్యవధిలో పరీక్షలు నిర్వహించి, పోస్టింగ్‌లిచ్చిన సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాకు కొత్తగా 200 మంది టీచర్లు
పార్వతీపురం అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 200 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. వారిలో 97 మంది స్కూల్ అసిస్టెంట్లు, 103 మంది ఎస్‌జీటీలు ఉన్నారు. బలిజిపేట మండలంలో 17 మంది, గుమ్మలక్ష్మీపురంలో ఒకరు, గరుగుబిల్లిలో 17, జియ్యమ్మ వలసలో 16, కొమరాడలో ఐదుగురు , కురుపాంలో ఒకరు, మక్కువలో 11 , పాచిపెంటలో 21, పార్వతీపురంలో నలుగురు, సాలూరులో 10, సీతానగరంలో ఇద్దరు చొప్పున స్కూల్ అసిస్టెంట్లు విధుల్లో చేరారు. బలిజిపేటలో ముగ్గురు, గుమ్మలక్ష్మీపురంలో 17 మంది, గరుగుబిల్లిలో ఒకరు, సీతానగరంలో ఒకరు జియ్యమ్మవలసలో ఐదుగురు, కొమరాడలో నలుగురు, కురుపాంలో 18 , మక్కువలో ఒకరు, పాచిపెంటలో ఏడుగురు, పార్వతీపురంలో 15, సాలూరు 29 మంది చొప్పున ఎస్‌జీటీలు పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు
చెప్పినట్టే సీఎం చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ ప్రకటించి 150 రోజుల్లో ఉద్యోగమిచ్చారు. నేను గుమ్మలక్ష్మీపురంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల భద్రగిరిలో తెలుగు టీజీటీగా ఉద్యోగంలో చేరాను. ఐదో తరగతి విద్యార్థులకు బోధించాను. నా ఉద్యోగ కల సాకారమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.
- బూరగాన దుర్గాప్రసాదరావు, టీజీటీ, భద్రగిరి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల
===========================
కల సాకారమైంది..
2021లో హిందీ పండిట్ శిక్షణ పొంది డీఎస్సీ కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించి చెప్పినట్టే తక్కువ వ్యవధిలో పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. నేను అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో టీజీటీ హిందీ టీచర్‌గా కొలువు పొందాను. నా కల సాకారమైంది. నా తల్లిదండ్రుల ఆశలు ఫలించాయి. సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖమంత్రి లోకేశ్‌కు రుణపడి ఉంటా.
- వెలగాడ అనిల్, పగులుచెన్నారు, కొఠియా గ్రూప్