Assault under the influence of marijuana గంజాయి మత్తులో దాడి
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:08 AM
Assault under the influence of marijuana సంతకవిటి మండలంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తూ యువకులు పట్టుబడిన ఘటనను ఈ ప్రాంతీయులు మరచిపోకముందే గంజాయి మత్తులో దాడి ఘటన జరగడం స్థానికంగా సంచలనమైంది. రాజాం పట్టణంలో గంజాయి సేవించిన నలుగురు యువకులు ఓ వైద్య విద్యార్థిని ఆదివారం రాత్రి వెంబడించి దాడి చేశారు. ఈ ఘటనతో రాజాం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గంజాయి మత్తులో దాడి
వైద్య విద్యార్థిపై నలుగురు యువకుల వీరంగం
అదుపులో నిందితులు?
రాజాం రూరల్, సెప్టెంబర్ 1(ఆంధ్రజ్యోతి): సంతకవిటి మండలంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తూ యువకులు పట్టుబడిన ఘటనను ఈ ప్రాంతీయులు మరచిపోకముందే గంజాయి మత్తులో దాడి ఘటన జరగడం స్థానికంగా సంచలనమైంది. రాజాం పట్టణంలో గంజాయి సేవించిన నలుగురు యువకులు ఓ వైద్య విద్యార్థిని ఆదివారం రాత్రి వెంబడించి దాడి చేశారు. ఈ ఘటనతో రాజాం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తరచూ గంజాయితో సంబంధం ఉన్న ఘటనలు చోటుచేసుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రాజాం పట్టణానికి చెందిన శివమణి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఇటీవల సెలవులకు రాజాం వచ్చిన ఆయన ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం రోడ్‌లోని బాలాజీ టెంపుల్ నుంచి డోలపేట వైపు వెళ్తుండగా ఓ బ్యాకరీ వద్ద నుంచి నలుగురు యువకులు గంజాయి మత్తులో అతని వెంట పడ్డారు. తనను ఎందుకు వెంబడిస్తున్నారని ప్రశ్నించగా సమాధానం ఇవ్వకుండా దాడి చేశారు. శివమణి దెబ్బలు కాస్తూ బతిమలాడాడు. అయినా సరే మత్తులో ఉన్న ఆ నలుగురు అతనిని కొట్టడం కొనసాగించారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారిలో కొందరు శివమణిని రక్షించేందుకు ప్రయత్నించినా వారు వినడం లేదు. దీంతో రాజాం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి ఆ నలుగురూ పరారయ్యారు. ఇదే విషయాన్ని రాజాం టౌన్ సీఐ కె.అశోక్‌కుమార్ వద్ద ప్రస్తావించగా ఓ యువకుడిని నలుగురు కొట్టడం తన దృష్టికి వచ్చిందని, వారిని గుర్తించామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారు మద్యం సేవించారా, గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారా తెలియాల్సి ఉందని సీఐ అశోక్ స్పష్టం చేశారు.
- విచ్చలవిడిగా గంజాయి సేవిస్తూ ఇంజినీరింగ్ తదితర యువతకు గంజాయిని విక్రయిస్తూ పట్టుబడిన సంఘటనలు రాజాం నియోజకవర్గ పరిధిలో చాలా జరిగాయి. పోలీసుల కళ్లుకప్పి చాటుమాటుగా గంజాయి సేవిస్తున్నారు. తాజాగా గంజాయి మత్తులో అందరూ తిరుగాడే బహిరంగ ప్రదేశంలో ఓ వైద్య విద్యార్థిపై దాడి చేయడమే కాకుండా అడ్డొచ్చే వారిపై విరుచుకుపడి భయాందోళన సృష్టించారు.
- యువకుల దాడికి గురైన వైద్య విద్యార్థి పోలీసుల్ని ఆశ్రయించేందుకు తొలుత వెనుకంజ వేసినా ఆదివారం రాత్రి పది గంటల తరువాత పోలీసులకు గోడు వెళ్లబోసుకున్నాడు. తనపై అకారణంగా దాడిచేశారని, వారెవ్వరో తనకు తెలియదని విలేకరులకు సైతం వివరించాడు. దీంతో రాజాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజిల్ని సేకరించాక యువకుడిని కొట్టినవారిని గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు.
ఇండియా రావాలంటే భయపడాలా?
శివమణి, బాధితుడు..
నేను ఫారిన్‌లో మెడిసిన్ చదువుతున్నాను. రాజాం వచ్చిన నేను శ్రీకాకుళం రోడ్‌లోని బాలాజీ టెంపుల్‌కి వెళ్లి వస్తుంటే నలుగురు యువకులు స్కూటీపై నన్ను వెంబడించారు. డోలపేట రోడ్‌లోని లక్కీ షాపింగ్ మాల్ వద్ద నన్ను ఆపి నా హెల్మెట్ తీసుకుని ఇష్టారాజ్యంగా కొట్టారు. వాళ్లంతా గంజాయి సేవించి ఉన్నట్లు అక్కడి వారంతా చెప్పారు. ఫారిన్‌లో కూడా ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇండియా వచ్చాకే ఇలా జరిగింది. ఇండియా రావాలంటే భయపడాల్సి వస్తోంది. రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశాను.