Share News

As if you know or don't know! తెలిసినా తెలియనట్టు!

ABN , Publish Date - May 20 , 2025 | 11:44 PM

As if you know or don't know! శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి గ్రామ పరిధిలో ఓ లేఅవుట్‌ మధ్య కనిపించే సాగునీటి బందను కొద్దికొద్దిగా పూడ్చడంతో కుచించుకుపోయింది. వాన నీరు ఇందులోకి పారేందుకు ఉన్న కాలువల ఆనవాళ్లనూ మార్చేశారు.

As if you know or don't know! తెలిసినా తెలియనట్టు!
ఎస్‌.కోట మండలం ముషిడిపల్లి గ్రామ పరిధిలో ఓ లేఅవుట్‌ మధ్యలో కుచించుకుపోయిన సాగునీటి బంద

తెలిసినా తెలియనట్టు!

చెరువు స్థలాల్లో రహదారులు, లేఅవుట్‌లు

జిరాయితీ భూముల్లో కలిసిపోతున్న గెడ్డలు

సాగునీటి వనరుల ఆక్రమణలను పట్టించుకోని అధికారులు

- శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి గ్రామ పరిధిలో ఓ లేఅవుట్‌ మధ్య కనిపించే సాగునీటి బందను కొద్దికొద్దిగా పూడ్చడంతో కుచించుకుపోయింది. వాన నీరు ఇందులోకి పారేందుకు ఉన్న కాలువల ఆనవాళ్లనూ మార్చేశారు.

- కొత్తవలస మండలం కంటికాపల్లి గ్రామ శివారు నరసరాజు చెరువు స్థలంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.50లక్షలతో రోడ్డును చేపడుతుండడం గమనార్హం. కొత్తసుంకరపాలెం శివారు దత్తిదనన్నపేట ప్రజలకు ఉపయోపడుతుందని పైకి చెబుతున్నప్పటికి ఓ ప్రైవేటు పరిశ్రమ, మరో లేఅవుట్‌ యాజమాన్యానికి లబ్ధిచేకూర్చేందుకే అన్నది బహిరంగ రహస్యం.

- వేపాడ మండలం కొండగంగుబూడి పంచాయతీ శివారు ఎస్‌కేఎస్‌ పురం గ్రామ పరిధిలోని గెడ్డ పక్కనున్న భూ యజమాని గెడ్డను కప్పేస్తున్నాడు. దీంతో చాలా వరకు కుచించుకుపోయింది. గెడ్డ నుంచి వరద నీరు పారేందుకు చిన్నగా పైపులు వేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ ఆక్రమణ అధికారులెవరికీ కనిపించడం లేదు. ఈ గెడ్డ నుంచి వరద నీరు విజయరామసాగర్‌తో పాటు అనేక గొలుసు చెరువులను నింపుతుంది.

శృంగవరపుకోట, మే 20(ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి రేటును ఆకాంక్షిస్తోంది. ఆర్థిక పురోగతికి జిల్లాలో వ్యవసాయ రంగాన్ని నమ్ముకుంది. ఈ రంగం ముందుకు సాగాలంటే సాగునీటి లభ్యత కీలకం. కానీ సాగుకు నీరందించే వనరులు ఽగతి తప్పాయి. వాటిని ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం చూసినా చూడనట్లు, తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత సమక్షంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సాగునీటి వనరుల ఆక్రమణల గురించి చర్చించారు. వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కీలక అధికారులంతా అక్కడే ఉన్నారు. ఇదిలా ఉండగా వేపాడ మండల కేంద్రానికి వెళ్లే రహదారి పక్కన ఓ బందను కప్పేందుకు మట్టిని వేసేసారు. కిందనున్న ఆయకట్టుదారులు స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు గ్రీవెన్స్‌లోనూ ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ఎటువంటి చర్యలకు పూనుకోలేదు. బందలో మట్టేసిన వారికి అనుకూలంగా గ్రామ స్థాయి అధికారొకరు మాట్లాడుతుండడం ఆయకట్టుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. జలవనరుల శాఖ బంద సర్వేకు తహసీల్దార్‌ కార్యాలయానికి లేఖ పంపించి చేతులు దులుపుకుంది. ఇలా జిల్లా వాప్తంగా సాగునీటి వనరులను కప్పేస్తున్నట్లు తెలిసిన అధికారులు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకుంటూ తప్పించుకుతిరుగుతున్నారు.

మా బాధ్యత కాదంటూ..

రెవెన్యూ అధికారులు సర్వే చేయడం లేదని జలవనరుల శాఖ, ఆక్రమణలను పంచాయతీ తొలగించడం లేదంటున్న రెవెన్యూ శాఖ, సాగునీటి వనరులను కాపాడేందుకు జలవనరుల శాఖ ప్రయత్నం చేయడం లేదని మిగిలిన రెండు శాఖలు ఎవరికి వారే కొత్త బాష్యాలను చెబుతున్నారు. అక్రమణలను తొలగించేందుకు, వాల్టా చట్ట ప్రకారం చర్యలు తీసుకొనేందుకు ఇష్టం పడడం లేదు. దీంతో చెరువులు, బందలు, గెడ్డలు, వాగుల కుచించుకుపోతున్నాయి. కొన్నిచోట్ల ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి.

సాగునీటి వనరులే ఆధారం

జిల్లా 60శాతం వర్షాధార ప్రాంతం. జూన్‌లో పడిన వర్షాలు, ఆ తరువాత తుఫాన్‌లు, వాయుగుండాల ప్రభావంతో కురిసే వర్షాలకు చెరువులు, వాగుల్లో చేరే నీటితోనే పంటలు పండుతాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాగు భూమికే ఈ నీరు సక్రమంగా అందడం లేదు. ఖరీఫ్‌ వరి పండించేందుకు రైతులు నీటికోసం ఏటా నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. నీటి కోసం చెరువుల్లో ఇంజన్‌లు పెట్టి తోడుకుంటున్నారు. దీనికి కారణం కొండల్లో పడిన వర్షపు నీరు వచ్చే గెడ్డలు చాలా వరకు ఆక్రమణల్లో ఉన్నాయి. పైనున్న భూయజమానులు వాటి రూపు రేఖలను మార్చేశారు. చెరువులు, బందల గర్భాలను కప్పేసారు. కొన్ని చోట్ల రియల్‌ ఎస్టేట్‌గా మారిపోయాయి. కనీసం ఇప్పుడున్న సాగునీటి వనరులనైనా కాపాడుకుంటే పంటల విస్తీర్ణం తగ్గకుండా ఉంటుంది. ప్రధానంగా సాగునీటి వనరుల ఆక్రమణలను అడ్డుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 20 , 2025 | 11:44 PM