Illegalities.. అక్రమాలకు అడ్డాగా..
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:04 AM
As a Barrier to Illegalities.. జిల్లాలో పలు పీఏసీఎస్‌లు అక్రమా లకు అడ్డాగా మారాయి. రైతుల నుంచి రుణాలు రికవరీ చేసినా రికార్డుల్లో చూపించకపోవడంతో అవకతవకలు బయటపడుతున్నాయి.
రికవరీ అంతంతమాత్రమే.. బాధ్యులపై చర్యలు శూన్యం
తాజాగా గరుగుబిల్లి పీఏసీఎస్‌లో అవకతవకలు వెలుగులోకి..
రూ.90 లక్షలకు పైగా పక్కదారి
విచారణ చేపడుతున్న అధికారులు
పార్వతీపురం/గరుగుబిల్లి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు పీఏసీఎస్‌లు అక్రమా లకు అడ్డాగా మారాయి. రైతుల నుంచి రుణాలు రికవరీ చేసినా రికార్డుల్లో చూపించకపోవడంతో అవకతవకలు బయటపడుతున్నాయి. 2014-15లో రావివలస పీఏసీఎస్‌కు సంబంధించి సుమారు రూ. 4 కోట్లు పక్కదారి పట్టాయి. అప్పట్లో సీబీఐ విచారణ జరపగా కొంతవరకూ రికవరీ చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా అక్రమాలకు పాల్పడిన పీఏసీఎస్ సిబ్బంది, దానికి కారకులైన వారిపై చర్యలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చెముడు పీఏసీఎస్‌లో లక్షలాది రూపాయలు దుర్వినియోగమైనా బాధ్యులపై ఎటువంటి చర్యల్లేవు. దీనిపై కొంతమంది పీఏసీఎస్ సిబ్బంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పార్వతీపురం మండలం కృష్ణపల్లి పీఏసీఎస్ పరిధిలో రుణమాఫీ జరిగినా.. నేటికీ ఆ రుణాలు రైతులను పట్టిపీడిస్తున్నాయి. తాజాగా గరుగుబిల్లి పీఏసీఎస్ అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
కొద్దిరోజుల కిందట విజయనగరం డీసీసీబీ సీఈవో సంతోష్‌కుమార్ గరుగుబిల్లి పీఏసీఎస్ అక్రమాలను గుర్తించారు. సభ్యుల పొందిన రుణాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడంతో వాస్తవాలు తెలుసుకున్నారు. సుమారు రూ. 90 లక్షలకు పైగా నిధులు పక్కదారిన పట్టినట్లు గుర్తించి మన్యం జిల్లా సహకార అధికారికి నివేదికలు అందించారు. ఈ మేరకు మంగళవారం విచారణ అధికారి ఆర్.రమణమూర్తి గరుగుబిల్లి పీఏసీఎస్ కార్యాలయంలో రుణాలు పొందిన రైతుల నుంచి సమాచారం సేకరించారు. సంఘం పరిధిలో సుమారు 1400 మందికి పైగా సభ్యులు ఉండగా.. ఇందులో 181 మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 60 మందికి పైగా విచారణ నిర్వహించారు. అక్టోబరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. త్వరలో ఉన్నతాధి కారులకు పూర్తిస్థాయిలో నివేదికలు అందించనున్నారు. గతంలో సీఈవోగా విధులు నిర్వహించి మృతి చెందిన ఎన్.గుంపస్వామి సుమారు 31 మంది పేరుతో రూ. 85 లక్షలకు పైబడి నిధులు పక్కదారి పట్టించినట్లు సమాచారం ఉందని, ప్రాథమిక విచారణ తర్వాత ఎంతమేర నిధులు దుర్వినియోగమయ్యాయో తేలుతుందని విచారణ అధికారి వెల్లడించారు.
రెండు రశీదు పుస్తకాలు మాయం
గరుగుబిల్లి పీఏసీఎస్‌కు సంబంధించి రెండు రశీదు పుస్తకాలు మాయమయ్యాయి. ఒక్కో పుస్తకంలో 50 రశీదులు ఉంటాయి. ఒక రశీదు డీసీసీబీ బ్రాంచ్‌లో, మరొకటి రుణం పొందిన రైతు వద్ద మరో రశీదు పీఏసీఎస్‌లో ఉంటుంది. అయితే మాయమైన రశీదు బుక్ నెంబర్ల (1125002, 1126512, 112700)ను విచారణ అధికారులు గుర్తించారు. కాగా సంఘానికి రుణాలు చెల్లించి నట్లు రశీదులు అందించినా ఆ మొత్తాలు రికార్డుల్లో నమోదు చేయలేదు. కాగా జిల్లాలో 45,671 మంది పీఏసీఎస్ సభ్యులు ఉండగా 39,044 మందికి ఈకేవైసీ పూర్తయింది.