Arrest of robbers దోపిడీ దొంగల అరెస్టు
ABN , Publish Date - May 30 , 2025 | 12:05 AM
Arrest of robbers కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆశ వారిని దొంగలుగా మార్చేసింది. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో రాణించకపోవడంతో అడ్డ దారిన కోటీశ్వరులైపోవాలని వేసిన పథకం వికటించడంతో కటాకటాల పాలయ్యారు. చీపురుపల్లి మెయిన్ రోడ్డులో ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.
దోపిడీ దొంగల అరెస్టు
ఎనిమిది మందిని పట్టుకున్న పోలీసులు.. మరో ఇద్దరు పరారీ
ఆరు రోజుల్లో కేసు ఛేదించిన వైనం
వివరాలు వెల్లడించిన చీపురుపల్లి డీఎస్పీ
చీపురుపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆశ వారిని దొంగలుగా మార్చేసింది. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో రాణించకపోవడంతో అడ్డ దారిన కోటీశ్వరులైపోవాలని వేసిన పథకం వికటించడంతో కటాకటాల పాలయ్యారు. చీపురుపల్లి మెయిన్ రోడ్డులో ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. స్థానికులు ఇచ్చిన సహకారంతోనే దొంగతనం జరిగినట్టు నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపి దొంగల్ని పట్టుకున్నారు. డీఎస్పీ ఎస్.రాఘవులు చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తెలిపారు.
చీపురుపల్లి మండలం గచ్చలవలస గ్రామానికి చెందిన మన్నేల సూర్యారావుకు చీపురుపల్లి పట్టణంలో ధనికుల వివరాలపై అవగహన ఉంది. అతను పట్టణంలోని వైశ్యరాజు సురేష్‌పై దృష్టి పెట్టాడు. డబ్బు, బంగారం భారీ ఉంటుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎండభద్రకు చెందిన జగంకు సమాచారం ఇచ్చాడు. సురేష్ ఇంటి ఫొటోలు, వీడియోలు పంపించాడు. సురేష్ ఇంట్లో బంగారం, నగదు ఎక్కడ ఉన్నదీ ఆయనకు వివరించాడు. ఆపై జగం ఈ సమాచారాన్ని విజయనగరంలో ఉన్న సావిత్రి (అలియాస్ జ్యోతి)కి తెలిపాడు. ఆమె ఇదే విషయాన్ని సంగారెడ్డి గూడెంలో ఉన్న ఆచంట వెంకటేశ్‌కు, విజయనగరంలో ఉన్న నాగరాజుకు చేరవేసింది. వీరంతా గతంలో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేశారు. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశ వీరందరినీ ఏకం చేసింది. ఈ నేపథ్యంలోనే నాగరాజు కూడా తనకు పరిచయం ఉన్న బాపట్లకు చెందిన నాజులబాబు, కిషోర్ అనే వ్యక్తులకు చెప్పాడు. తమకు అందిన ఈ సమాచారాన్ని నాజులబాబు, తనకు అత్యంత సన్నితుడైన శ్యాంకుమార్, కైకలూరుకు చెందిన వంగర శ్రీనివాసరావుకు చెప్పాడు. వీరంతా ఒక గ్రూపుగా ఏర్పడి దొంగతనానికి సంబంధించి పలు మార్లు మాట్లాడుకున్నారు. తమ వద్దనున్న పక్కా సమాచారం ఆధారంగా చీపురుపల్లిలో దొంగతనానికి పథకం వేశారు. ఈ నెల 23న వీరంతా రాజమండ్రిలో కలిసి చర్చించుకున్నారు. అదే రోజున ఉదయం విజయనగరం చేరుకొని, అక్కడి ఓ రెస్టారెంట్‌లో మరోసారి సమావేశమయ్యారు. 23న సాయంత్రం కారులో చీపురుపల్లి చేరుకొని సురేష్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. తమకు అందిన సమాచారం నిజమేనా కాదా అని నిర్ధారించుకొని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో నాజుల్‌బాబు, శ్యాంకుమార్, శ్రీనివారావు, కిషోర్‌లు సురేష్ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ నిద్రలో ఉన్న వారణాసి కస్తూరిబాయి, వైశ్యరాజు చిట్టెమ్మలను తీవ్రంగా గాయపరిచారు. వెనువెంటనే వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దోచుకుని పరారయ్యారు. కేసులో మొత్తం పది మంది భాగస్వాములు కాగా ఇప్పటి వరకూ నాజుల్‌బాబు, జగం, శ్యాంకుమార్, వంగర శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, నాగరాజు, దాసు సావిత్రి, మన్నేల సూర్యారావు అనే ఎనిమిది మంది నిందితుల్ని ఈ నెల 28న విజయనగరంలో అరెస్టు చేసినట్టు డీయస్పీ ఎస్. రాఘవులు తెలిపారు. వీరి నుంచి 5.5 తులాల బంగారు అభరణాలు, సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా 17.5 తులాలు చోరీకి గురయినట్టు బాధితులు ప్రాథమికంగా చెప్పారని, ఫిర్యాదుదారు సురేష్ వేరే ప్రాంతంలో ఉన్నందున, చోరీ సొత్తుపై స్పష్టత లేదని అన్నారు. కారు డ్రైవర్ మనోజ్, టి.కిషోర్ పరారయినట్టు ఆయన తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామన్నారు. కాగా గతంలో ఈ ముఠా హైదరాబాద్, ఏలూరు, సంగారెడ్డి, ఖమ్మంలలో దోపిడీకి విఫలయత్నం చేసిందన్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన చీపురుపల్లి సీఐ జి.శంకరరావు, చీపురుపల్లి, గరివిడి, బుదరాయవలస ఎస్సైలు ఎల్.దామోదరరావు, లోకేష్, లోకేశ్, సిబ్బందిని, డీయస్సీ రాఘవులు అభినందించారు.