are they safe ఎలా ఉన్నారో.. ఏమో?
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:00 AM
are they safe బంగ్లాదేశ్‌లో బందీలైన మత్స్యకారులను తలుచుకుని వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. చాలా రోజులైనా తమ వారి రాకపై స్పష్టత రాకపోవడంతో భయపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వారి రాక ఆలస్యమవుతుందేమోనని కలవరపడుతున్నారు.
ఎలా ఉన్నారో.. ఏమో?
బంగ్లాదేశ్‌లో బందీలైన మత్స్యకారుల కుటుంబీకుల్లో ఆందోళన
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. భారత్‌లో ఆగ్రహజ్వాలలు
తమ వారిని ఎలా చూస్తారోనని జిల్లా వాసుల్లో కలవరం
భోగాపురం, డిసెంబరు24(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌లో బందీలైన మత్స్యకారులను తలుచుకుని వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. చాలా రోజులైనా తమ వారి రాకపై స్పష్టత రాకపోవడంతో భయపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వారి రాక ఆలస్యమవుతుందేమోనని కలవరపడుతున్నారు.
భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన ఆరుగురు, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన ఇద్దరు, బర్రిపేటకు చెందిన ఒకరు మొత్తం 9 మంది మత్స్యకారులు అక్టోబరు 22వ తేదీన సముద్రంలో వేటాడుతూ అనుకోకుండా బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కారు. అక్కడి నేవీ అధికారులు 9 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అయితే మత్స్యకారులను బంగ్లాదేశ్ నుంచి విడిపించి స్వగ్రామాలకు రప్పించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోజులు గడుస్తున్నా బందీలైన మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో మత్స్యకార కుటుంబాల్లో అలజడి, భయాందోళనలు మొదలయ్యాయి. అయితే బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపుచంద్రదాస్‌పై ఇటీవల మూకదాడి చేసి కాల్చేసిన ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీ, కోల్‌కతాల్లో నిరసనలు భగ్గుమన్నాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద, హెచ్‌పీ, బజరంగ్‌దళ్ తదితర సంస్థలు బంగ్లాదేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దౌత్య కార్యాలయాల వద్ద హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని తమ సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. జరుగుతున్న సంఘటనలను పత్రికలు, వార్తా చానల్స్ ద్వారా వివిధ రకాలుగా తెలుసుకొంటున్న మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పట్లో తమ వారిని చూడగలుగుతామా అని సందేహపడుతున్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య మంచి వాతావరణం నెలకొని త్వరగా తమ వారిని స్వగృహాలకు వచ్చేలా చూడాలని దేవుని వేడుకుంటున్నారు.
-------------------