Share News

are they fitting the shutters? షట్టర్లు బిగిస్తారా?

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:16 AM

are they fitting the shutters?రెండు జిల్లాల పరిధిలోని సాగు భూములను సస్యశ్యామలం చేయాల్సిన ప్రాజెక్టు అది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరింత గాడి తప్పింది. ఆధునికీకరణ పనుల సంగతి అటుంచితే కనీసం మరమ్మతులు చేయలేదు. షట్లర్లు ఊడిపోయినా బిగించే నాథుడు కరువైపోయాడు. ఆఖరుకు అన్ని షట్టర్లూ ఊడిపోయి దయనీయంగా కనిపిస్తోంది.

are they fitting the shutters? షట్టర్లు బిగిస్తారా?
అధ్వానంగా నారాయణపురం ఆనకట్ట

షట్టర్లు బిగిస్తారా?

అగమ్యగోచరంగా నారాయణపురం ప్రాజెక్టు

సంవత్సరాలుగా పట్టించుకోని వైనం

శిథిలమై ఊడిన షట్టర్లు

నిల్వ ఉండని నీరు

నిరాశలో ఆయకట్టు రైతులు

రాజాం/సంతకవిటి, జూలై 5(ఆంధ్రజ్యోతి):

రెండు జిల్లాల పరిధిలోని సాగు భూములను సస్యశ్యామలం చేయాల్సిన ప్రాజెక్టు అది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరింత గాడి తప్పింది. ఆధునికీకరణ పనుల సంగతి అటుంచితే కనీసం మరమ్మతులు చేయలేదు. షట్లర్లు ఊడిపోయినా బిగించే నాథుడు కరువైపోయాడు. ఆఖరుకు అన్ని షట్టర్లూ ఊడిపోయి దయనీయంగా కనిపిస్తోంది. నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు. ప్రాజెక్టు దీన స్థితిని చూస్తున్న ఆయకట్టు రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కొత్త షట్టర్లు వచ్చినా నిర్లక్ష్యంగా పడి ఉండడం గమనార్హం. నాగావళి నదిపై సంతకవిటి మండలంలో ఉన్న నారాయణపురం ఆనకట్ట దుస్థితిది.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 11 మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరందించే నారాయణపురం ప్రాజెక్టు కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. సంతకవిటి మండలం రంగారాయపురం సరిహద్దులో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం గ్రామం వద్ద నాగావళి నదిపై 1959-63 మధ్య నారాయణపురం ఆనకట్టను నిర్మించారు. సంతకవిటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో 50 వేల ఎకరాలకు ఈ ఆనకట్ట సాగునీరు అందిస్తూ వచ్చింది. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వైపు చూడలేదు. దీంతో ఆనకట్ట పూర్తిగా దెబ్బతింది. షట్టర్లు, రెగ్యులేటర్లు, స్పిల్‌వే, కాలువలు, గట్లు ఇలా అన్నీ బలహీనమయ్యాయి. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.112.10 కోట్ల జైకా నిధులు వచ్చాయి. కొంత మేర పనులు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పనులు అంటూ హడావుడి చేశారే తప్ప పూర్తిచేయలేదు. పైగా 35 శాతం పనులు చేశామని చెప్పి రూ.14 కోట్ల ఖర్చును గణాంకాల్లో చూపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాథమికంగా షట్టర్ల నిర్మాణంపై దృష్టిపెట్టింది. శిథిలమైన షట్టర్ల తయారీకి రూ.1.23 కోట్లు విడుదల చేసింది. అయితే జూలై రెండో వారం సమీపిస్తున్న ఆ షట్టర్లను బిగించలేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో నదిలో నీటి ప్రవాహం పెరిగితే షట్టర్ల బిగింపు అనేది కష్టతరంగా మారనుంది. వీలైనంత త్వరగా షట్టర్లు ఏర్పాటు చేసి సాగునీటిని అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

త్వరలో షట్టర్ల పనులు

త్వరలో షట్టర్లు బిగిస్తాం. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. షట్టర్లు బిగించిన తరువాతే సాగునీటిని విడుదల చేస్తాం. ఖరీఫ్‌లో సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. శివారు ఆయకట్టు వరకూ సాగునీరు అందిస్తాం.

- రవీంద్రనాయుడు, డీఈఈ,

Updated Date - Jul 06 , 2025 | 12:16 AM