Are the trees in the way? చెట్లు అడ్డమా?
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:22 AM
Are the trees in the way? ముషిడిపల్లి పంచాయతీ పరిధిలోని తాటిపూడి గురుకుల బాలికల పాఠశాల ఆవరణలో ఉన్న భారీ వృక్షాలను సోమవారం తొలగించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లుగా చెప్పుకునే విద్యాలయంలో ఇలా చెట్లు కొట్టేయడమేంటని ప్రిన్సిపాల్ ప్రతిభాభారతిని ప్రశ్నించారు.
చెట్లు అడ్డమా?
తాటిపూడి గురుకుల పాఠశాలలో వృక్షాల నరికివేత
అనుమతి లేకుండా తొలగింపునకు ఆదేశాలు
ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన స్థానిక యువత
ఎస్.కోటరూరల్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ముషిడిపల్లి పంచాయతీ పరిధిలోని తాటిపూడి గురుకుల బాలికల పాఠశాల ఆవరణలో ఉన్న భారీ వృక్షాలను సోమవారం తొలగించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లుగా చెప్పుకునే విద్యాలయంలో ఇలా చెట్లు కొట్టేయడమేంటని ప్రిన్సిపాల్ ప్రతిభాభారతిని ప్రశ్నించారు. ఎన్నోఏళ్లుగా ఉన్న వృక్షాలను ఎలా నరికివేయిస్తారని నిలదీశారు. వాటిని తరలించకుండా అడ్డుపడ్డారు. ఆమె రెవెన్యూ, అటవీశాఖ అనుమతులు తీసుకోకుండా చెట్లను కొట్టించారు. ఆపై గంట్యాడ మండలం గింజేరు కర్రల వ్యాపారులకు విక్రయించారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా తనకు అనుమతులు తీసుకోవాలన్న విషయం తెలియదని, చెట్టుకొమ్మలు పాఠశాలపై పడుతుండడతో భవనాలు దెబ్బతింటున్నాయని, పాములు కూడా వస్తున్నాయని చెప్పారు. ఆ చెట్లను రూ.పదివేలకు విక్రయించామని, ఈవిషయం పాఠశాల తీర్మానం పుస్తకంలో నమోదు చేశామని, ఉన్నతాధికారులకు నివేదిక కూడా పంపుతామని వెల్లడించారు. ఇదే విషయమై అటవీశాఖ డీఆర్‌వో రవికుమార్ వివరణ కోరగా చెట్లు నరకాలంటే అటవీ అనుమతులు ఉండాలని, సిబ్బందిని పంపించి పరిశీలిస్తామని అన్నారు. తహసీల్దార్ శ్రీనువాసరావును వివరణ కోరగా చెట్లు నరికేముందు అనుమతులు తీసుకోవాలని, తమ నుంచి వారు అనుమతి తీసుకోలేదని, వీఆర్‌వోను పంపించి పరిశీలిస్తామని చెప్పారు.