Road Troubles దారి కష్టాలు తప్పవా?
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:13 AM
Are Road Troubles Inevitable? సీతంపేట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గతంలో నిర్మించిన రహదారి పనులపై విజిలెన్స్ అధికారులు చేపడుతున్న విచారణ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వాటిపై వచ్చిన ఆరోపణల మేరకు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని రోడ్లను విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో టెక్నికల్ టీం సభ్యులు మూడు విడతల్లో పరిశీలించారు.

గత వైసీపీ సర్కారు హయాంలో మంజూరు
అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు
కాంట్రాక్టర్ల తీరుపై విమర్శలు
కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ
క్లియరెన్స్ రాక నిలిచిన రోడ్ల నిర్మాణాలు
గిరిజనులకు తప్పని ఇబ్బందులు
సీతంపేట రూరల్, జూన్10(ఆంధ్రజ్యోతి): సీతంపేట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గతంలో నిర్మించిన రహదారి పనులపై విజిలెన్స్ అధికారులు చేపడుతున్న విచారణ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వాటిపై వచ్చిన ఆరోపణల మేరకు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని రోడ్లను విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో టెక్నికల్ టీం సభ్యులు మూడు విడతల్లో పరిశీలించారు. ఇంకా పాతపట్నం, పలాస, మందస, మెళియాపుట్టి, హిరమండలం మండలాల్లో నిర్మించిన రహదారుల పనులపై విచారణ చేపట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో చేపట్టిన రహదారి పనులు సగంలో నిలిచిపోగా.. వర్షాకాల సీజన్‌లో అవి మరింతగా పాడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజిలెన్స్ అధికారుల విచారణ పూర్తిచేసి నివేదిక ఇస్తే కాని వాటి పనులు పునఃప్రారంభించే పరిస్థితి లేదు. దీంతో గిరిజనులకు ఇప్పట్లో రహదారి కష్టాలు తప్పెటట్లు లేవు. మొత్తంగా 36 రహదారుల పనులకు క్లియరెన్స్ రావల్సి ఉంది.
ఇదీ పరిస్థితి...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019- 2023) గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించారు. ఉపాధి నిధులతో ఈ పనులు చేట్టారు. అయితే ఐటీడీఏ పరిధిలో సీతంపేట, పాతపట్నం, మందస, పలాస, మెళియాపుట్టి, హిరమండలం మండలాల్లో చేపట్టిన రహదారి నిర్మాణ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగినట్లు శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి గతంలో ఫిర్యాదులు వెళ్లాయి. మొత్తంగా ఆయా మండలాల్లో 36 రహదారుల్లో రూ.54.88 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సంబంధిత విజిలెన్స్ అధికారులు ఇప్పటికి మూడు పర్యాయాలు సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. అప్పట్లో నిర్మించిన రహదారి నిర్మాణ పనులు, నాణ్యత ప్రమాణాలు నిగ్గుతేల్చే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఏవైతే రహదారుల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయో ఆ రహదారుల పరిస్థితి పరమ అధ్వానంగా మారింది. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాంట్రాక్టర్ల హవా
- సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖలో కాంట్రాక్టర్ల హవా నడుస్తోంది. ఇంజనీరింగ్ అధికారులకు నచ్చిన వారికి పనులతో పాటు కార్యాలయంలో ఏం కావాలన్నా సొంతంగా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇటీవల ఓ కాంట్రాక్టర్ ఆ శాఖ కార్యాలయంలోని కంప్యూటర్‌లో నిక్షిప్తమైన ఎస్టిమేట్‌లను సొంతంగా ప్రింట్‌లు తీసుకోవడం కనిపించింది. ఎంబుక్‌లను కాంట్రాక్టర్లే నేరుగా కార్యాలయ బీరువా నుంచి వెతికి తీసుకుపోవడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఇదేమిటని అడిగేవారు లేకపోవడంతో ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తు న్నారనే విమర్శలూ లేకపోలేదు. పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు వెళ్లాలంటే కాంట్రాక్టరే ఓ ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. పని జరిగే ప్రదేశానికి తీసుకువెళ్లి, తీసుకురావాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అలా కాంట్రాక్టర్లు చేయకుంటే ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించరని, బిల్లు రికార్డింగ్ చేయరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- ఇక పాతపట్నం డివిజన్ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ ఏఈ ఏకంగా కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన విషయాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై కూడా సంబంధిత ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇలా ఈ శాఖపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నా సంబంధిత శాఖ అధికారుల్లో ఎటువంటి మార్పు రాకపోవడం శోచనీయం.
పనులు నత్తనడకనే..
ఐటీడీఏ పరిధిలోని 20 సబ్‌ప్లాన్ మండలాల్లో గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపడుతున్న వివిధ రకాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఉపాధి పథకం ద్వారా నిరిస్తున్న రహదారి పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లింపులు జరగలేదు. దీంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇతర గ్రాంట్ నిధులతో నిర్మిసున్న పనులకు సంబంధించి బిల్లులు రికార్డింగ్ చేయడంలో ఇంజనీరింగ్ సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా పనులను నిలిపివేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయం(2018)లో చేపట్టిన ఆశ్రమ పాఠశాలల మరమ్మతు పనులకు సంబంధించిన(మెంటినెన్స్ గ్రాంట్)బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కొన్ని బిల్లులను ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఇంకా 50కి పైగా వర్క్‌ల బిల్లులను చెల్లించాల్సి ఉంది.
నాణ్యతకు తిలోదకాలు...
సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీతంపేట నుంచి నౌగూడ అక్షరబ్రహ్మ దేవాలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణం పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఉపాధి నిధులు రూ.80లక్షలతో సంబంధిత కాంట్రాక్టర్ దాని పనులు ప్రారంభించారు. రహదారి పొడవునా డబ్ల్యూబీఎం (వెట్‌మిక్స్)పరిచారు. ఇంకా అక్కడక్కడా 150 మీటర్ల వరకు రక్షణ గోడలు నిర్మించారు. అయితే ఇంజనీరింగ్ అధికారి, సిబ్బంది పర్యవేక్షణ లేకపోడంతో పనుల్లో నాణ్యత లోపం కనిపిస్తోంది. నిబంధనల ప్రాప్తికి రక్షణగోడల పనుల్లో 53గ్రేడ్ సిమెంట్ వినియోగించాల్సి ఉంది. కానీ పీపీసీ(43గ్రేడ్)సిమెంట్‌ను వినియోగించారని, రక్షణగోడలకు క్యూరింగ్ కూడ చేయలేదని పెదరామ ఉపసర్పంచ్ సవర బోగేసు, నౌగూడ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇలా నిర్మాణలు చేపడితే ఎంతకాలం ఉంటాయని వారు ప్రశ్నిస్తున్నారు.
టీడబ్ల్యూ ఈఈ ఏమన్నారంటే...
‘ గతంలో చేపట్టిన రహదారి పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇది పూర్తయిన తరువాత వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చేసుకొని మిగిలిన పనులు పునఃప్రారంభిస్తాం. మా కార్యాలయంలో కాంట్రాక్టర్లకు ఎటువంటి ఫ్రీహ్యాండ్ ఇవ్వలేదు. అటువంటి విషయం మా దృష్టికి రాలేదు.’ అని టీడబ్ల్యూ ఈఈ రమాదేవి తెలిపారు.