Are Rajam's roads getting better? రాజాం రోడ్లు బాగుపడవా?
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:57 PM
Are Rajam's roads getting better? రాజాంలో రహదారులు బాగుపడడం లేదు. సంవత్సరాలుగా స్థానికులు ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. మరోవైపు నేతలు హామీలు ఇస్తునే ఉన్నారు. వాటి రూపు మాత్రం మారడం లేదు. విస్తరణ పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. ఇదంతా ఒకెత్తు అయితే అసలే అంతంతమాత్రంగా ఉన్న రహదారులపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
రాజాం రోడ్లు బాగుపడవా?
ఇప్పటికే విస్తరణ పనులు ఆగి అస్తవ్యస్తం
ఎక్కడికక్కడే గుంతలు, రాళ్లు
నేటికీ ఆగని భారీ వాహనాల రాకపోకలు
మరింత అధ్వానంగా మారుతున్న రహదారులు
విస్తరణ పనుల నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్
రాజాంలో రహదారులు బాగుపడడం లేదు. సంవత్సరాలుగా స్థానికులు ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. మరోవైపు నేతలు హామీలు ఇస్తునే ఉన్నారు. వాటి రూపు మాత్రం మారడం లేదు. విస్తరణ పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. ఇదంతా ఒకెత్తు అయితే అసలే అంతంతమాత్రంగా ఉన్న రహదారులపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. క్వారీ లారీలు, భారీ యంత్రాలను తీసుకువెళ్లే లారీలు రాజాం మీదుగా వెళ్తూ ఇతర ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. వీటిని కట్టడి చేయాలని ఇన్‌చార్జి మంత్రి అనిత ఇటీవల జరిగిన డీఆర్సీలో ఆదేశించారు. కానీ ఆచరించేవారెవరు?
రాజాం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాజాం పట్టణంలో ఇప్పటికే గుంతలతో ఉన్న రోడ్లుపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో అడుగుకో గుంత తయారవుతోంది. రహదారులు చిధ్రం అవుతున్నాయి. చెరకు లోడు లారీలతో పాటు క్వారీ లారీలు సైతం రాజాం మీదుగా వెళుతున్నాయి. అటు పార్వతీపురం మన్యం, ఒడిశా, చత్తీస్‌గడ్‌లకు పారిశ్రామిక అవసరాలకు ముడిపదార్థాలు, యంత్రాలు తరలించే వాహనాలు కూడా ఇవే రోడ్లుపై వెళుతుండడంతో నడవటానికి కూడా పనికిరాకుండా మారుతున్నాయి. ఇప్పటికే విస్తరణ పనులు నిలిచిపోయాయి. సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు విస్తరణకు ఉపయోగించే వాహనాలను, యంత్రాలను తరలించడంతో పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో భారీ వాహనాలు వెళుతుండడంతో రహదారులు నాశనమవుతున్నాయి.
నాలుగేళ్ల కిందట ప్రారంభించిన విస్తరణ పనులు కొలిక్కి తేలేకపోయారు. కాలువలు నిర్మించలేకపోయారు. డ్రైనేజీ వ్యవస్థను సరిచేయలేకపోయారు. నాలుగేళ్ల కిందట బొబ్బిలి రోడ్డు నుంచి గాయత్రీనగర్ వరకూ.. అంబేడ్కర్ జంక్షన్ నుంచి జీఎంఆర్ ఐటీ వరకూ రహదారి విస్తరణ, కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. దీంతో పట్టణ స్వరూపమే మారిపోతుందని వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటించారు. టెండరు దక్కించుకున్న సంస్థ పనులను ప్రారంభించింది. 2023 నవంబరు వరకూ సుమారు రూ.6 కోట్ల పనులు చేపట్టింది. ఆ తర్వాత బిల్లుల చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పనుల్లో కదలిక వచ్చింది. పనులు ప్రారంభమయ్యాయి. అంతలోనే కాంట్రాక్టర్ వేరే దగ్గర పనుల కోసం ఇక్కడి యంత్రాలు, పరికరాలను తరలించారు. ఆ తర్వాత ఎందుకో మరి రాజాం రోడ్ల విస్తరణ పడకేసింది.
మధ్యలో వదిలేశారు
రేగిడి మండలంలో చక్కెర కర్మాగారం ఉంది. ఆపై రాతి క్వారీలు ఉన్నాయి. వీటి వద్దకు రాజాం పట్టణం మీదుగా లారీలు వెళుతుంటాయి. బరువు అధికంగా ఉండడం వల్ల రోడ్లు పాడయ్యాయి. రెండేళ్ల కిందట రాజాం జీఎంఆర్ ఐటీ నుంచి దేవుదల గ్రామం వరకూ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేసింది. మేజర్ పనులు పూర్తయ్యాయి. జంక్షన్‌ల వద్ద పనులు పెండింగ్‌లో ఉంచారు. అక్కడ సీసీ రహదారులు, కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. ఇక సంతకవిటి మండల కేంద్రం వెళ్లాలన్నా.. శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళ్లాలన్నా నరకయాతన తప్పడం లేదు.
బిల్లుల పెండింగ్
రాజాంలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వేరేచోట రోడ్డు పనులకు అంటూ ఆయన యంత్రాలు, వాహనాలు తరలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. పనులు తిరిగి ప్రారంభించే చర్యలు చేపడతాం. సామర్థ్యానికి మించిన వాహనాలు రాకపోకలు సాగిస్తే చర్యలు తీసుకుంటాం.
- నాగభూషణరావు, ఆర్‌అండ్‌బీ ఏఈ, రాజాం