Are our buses safe?మన బస్సులు భద్రమేనా?
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:54 PM
Are our buses safe?
మన బస్సులు
భద్రమేనా?
జిల్లా నుంచి 100కు పైగా ట్రావెల్ బస్సుల రాకపోకలు
మరో 200 వరకూ జిల్లామీదుగా ప్రయాణం
ఒడిశా, చత్తీస్‌గఢ్‌కు జెట్ స్పీడుతో వాహనాలు
పండుగలు వస్తే దందా వేరు
పట్టించుకోని ఆర్టీఏ అధికారులు
- ఆగస్టు 19న విజయనగరం మండలం చెల్లూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి పాలకొండ వెళుతుండగా తెల్లవారుజామున డివైడర్ ఎక్కి రోడ్డుపైకి దూసుకుపోయింది. ఆ సమయంలో వాహనాలేవీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈఘటనలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
జిల్లా మీదుగా వందలాదిగా వెళ్తున్న ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం భద్రమేనా? అన్న ప్రశ్న అందరిలో ఉదయిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోకపోయినా కర్నూల్ బస్సు ప్రమాదంతో ఆలోచన మొదలైంది. కొన్ని లోపాలు తరచూ చర్చకు వస్తున్నా ఏం కాదులే అన్న నిర్లిప్తతతో యథావిధిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలను పాటించడం లేదు. ఆర్టీవో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒడిశా, చత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న ట్రావెల్ బస్సులు జెట్ స్పీడుతో వెళ్తున్నాయని అందరూ చెప్పుకుంటున్న మాట. బస్సులో వైరింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం లేదని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు.
విజయనగరం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు మధ్యస్థంగా ఉండే విజయనగరం మీదుగా ప్రతిరోజూ అనేక ట్రావెల్ బస్సులు ప్రయాణిస్తుంటాయి. ప్రధాన రవాణా కేంద్రంగా కూడా ఉంది. సుమారు 100 పైగా ట్రావెల్ బస్సులు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. 200 వరకు ట్రావెల్ బస్సులు జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని బిలాయ్, రాయ్‌పూర్, జైపూర్ తదితర ప్రాంతాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్, భువనేశ్వర్ నగరాలకు బస్సులు జిల్లా మీదుగా వెళ్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ట్రావెల్ బస్సులు రాత్రిపూట రాకపోకలు సాగిస్తున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకుపోతుంటాయని అందరూ చెబుతున్నారు. ఈ విషయంలో వారికి అధికారులు మార్గనిర్దేశం ఇచ్చే పరిస్థితి లేదు.
50 శాతానికిపైగా రిజిస్ర్టేషన్లు అక్కడే...
జిల్లాలో 100 వరకూ సొంత ట్రావెల్ బస్సులు ఉన్నాయి. మరో 50 వరకూ ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఉన్నారు. వీటిలో 50 శాతానికిపైగా స్థానికంగా రిజిస్ర్టేషన్ లేనివే. ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, సిక్కిం రాష్ర్టాల పేరుతో రిజిస్ర్టేషన్ చేసి ఉంటున్నాయి. అక్కడ తక్కువ పన్ను, ఫీజుతో పాటు క్షణాల్లో రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం వాట్సాప్, మెయిల్‌లో వివరాలు పంపిస్తే చాలు రిజిస్ర్టేషన్ పూర్తయినట్టే. దీనివల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.50 వేలు చెల్లిస్తే సరిపోతుంది. మన దగ్గర అయితే స్లీపర్ బెర్తులు 36కుగాను ఒక్కో బెర్తుకు రూ.3,500 చొప్పున..ప్రతి మూడు నెలలకు రూ.1,25,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేయాలి.
భద్రతా ప్రమాణాలు అంతంతే..
ప్రస్తుతం బీఎస్6 బస్సులు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. వీటిలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల విషయమై కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్‌ను వారు తప్పనిసరిగా తీసుకోవాలి. షార్ట్ సర్క్యూట్, ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగినప్పుడు బస్సు బాడీ ప్రమాదాన్ని నియంత్రించే విధంగా ఉండాలి. దీనిని నిర్ధారించేందుకే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. మన రాష్ట్రంలో ఈ సర్టిఫికెట్ ఉంటేనే బస్సు రిజిస్ర్టేషన్ జరుపుతారు. అయితే ఈ సేఫ్టీ సర్టిఫికెట్ పొందడానికి రూ.2 లక్షలు ఖర్చు అవుతుంది. అదే ఈశాన్య రాష్ట్రాల్లో అయితే రూ.50 వేలుతో అయిపోతుంది. కనీస భద్రత చూడకుండా సంబంధిత అధికారులు దళారీల ద్వారా ఆ రాష్ట్ర ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. మరోవైపు బీఎస్6 బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే వీటిలో 200 వరకూ వైర్లు ఉంటాయి. చిన్న సమస్య వచ్చినా సంబంధిత కంపెనీ ప్రతినిధి రావాల్సిందే. దీంతో తనిఖీలను ట్రావెల్స్ యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది.
ఫ విజయనగరంతో పాటు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో సాయంత్రం 5 దాటితే చాలు ట్రావెల్ బస్సుల హవా కనిపిస్తోంది. ఆ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను లెక్కచేయడం లేదు. పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు. కనీసం కర్నూలు ఘటనతోనైనా యంత్రాంగంలో చలనం వస్తుందా? అనేది చూడాలి.
ఫ నిజానికి అన్నీ ట్రావెల్స్ బస్సులకు పూర్తి స్థాయిలో అనుమతులు ఉండవు. కేవలం టూరిస్టు బస్సులుగానే అనుమతులు ఇస్తారు. వివిధప్రాంతాల నుంచి విజయనగరం మీదుగా ప్రయాణించే అనేక బస్సులకు స్టేజీ పర్మిషన్ లేదు. ఆర్టీవో అధికారుల్లో ఒకరికి ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి భారీగా ముడుపులు రావటంతో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
జిల్లాలో ప్రైవేటు బస్సులు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం. ఆరు నెలల నుంచి తనిఖీలు చేపట్టి గూడ్స్ లగేజీతో ఉన్న వాహనాలపై 30 కేసులు నమోదు చేశాం. ప్రతి సోమవారం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాం. త
- మణికుమార్, రవాణాశాఖ ఉప కమిషనర్, విజయనగరం
రవాణాశాఖాధికారుల తనిఖీలు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నాలుగు బస్సులు సీజ్
విజయనగరం క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రవాణాశాఖాధికారులు శనివారం సాయంత్రం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను విజయనగరంలో తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్ ఆధ్వర్యంలో సీనియర్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కేవీ ప్రకాష్, ఎంవీఐ నవీన్‌కుమార్, ఇతర సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఎల్‌ఐసీ భవనం సమీపంలో వాహన రికార్డులను పరిశీలించారు. కొన్ని వాహనాల్లో సిటింగ్ బదులు స్లీపింగ్ బెర్తులుగా సర్దుబాటు చేశారు. గమనించిన ఆర్‌టీవో అఽధికారులు ఆరా తీశారు.