వైద్య పరికరాలన్నీ ఉన్నాయా?
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:02 AM
: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్‌ఎం) టీం గురువారం సందర్శించింది.
సిబ్బంది పనితీరు ఎలా ఉంది?
ఆరా తీసిన సీఆర్‌ఎం టీం
జిల్లా ఆసుపత్రి సందర్శన
బెలగాం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్‌ఎం) టీం గురువారం సందర్శించింది. ఈ బృందం సభ్యులు డాక్టర్ దీపికా శర్మ, డాక్టర్ రమణ, డాక్టర్ నీరజ్‌కుమార్ జిల్లా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు, వైద్య సిబ్బంది పనితీరు, అవసరమైన వైద్య పరికరాలన్నీ ఉన్నాయా? లేదా? అని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, సరిపడ వైద్యులను నియమిస్తే ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ శివ నాగజ్యోతి తెలిపారు. ఎంఆర్‌ఐ స్కాన్ సదుపాయం, కార్డియాలజీ విభాగం, నెప్రాలిజి, న్యూరో సర్జరీ, ట్రూమా కేర్ మంజూరు చేయాలని డీసీహెచ్ జి.నాగభూషణరావు కోరారు. ఈ సదుపాయాలు ఇక్కడ లేకపోవడంతో రోగులను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేయాల్సి వస్తోందని వివరించారు. 150 కిలోమీటర్ల దూరం ఉన్న విశాఖకు వెళ్లే సమయంలో రోగుల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు. అలాగే అన్ని సౌకర్యాలతో ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అదనపు సంచాలకుడు డాక్టర్ అనిల్‌కుమార్, డీఎంహెచ్‌వో భాస్కరరావు, జిల్లా వైద్యాధికారులు రఘు, టి.జగన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.