Are all the children coming? పిల్లలంతా వస్తున్నారా?
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:09 AM
Are all the children coming? గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల పనితీరు పక్కదారి పట్టింది. రికార్డుల్లో ఎక్కువ మంది వస్తున్నట్లు చూపుతున్నారు.. వాస్తవంగా చూస్తే అత్యల్పంగా ఉంటున్నారు. ఐసీడీఎస్ అధికారులు సమగ్రంగా పర్యవేక్షించపోవడంతో కేంద్రాలు సక్రమంగా నడవడం లేదు.
పిల్లలంతా వస్తున్నారా?
అంగన్వాడీ కేంద్రాల్లో అరకొరగా హాజరు
పర్యవేక్షించని అధికారులు
రికార్డుల్లో సంఖ్యకు వస్తున్న వారికీ మధ్య తారతమ్యం
వేపాడ, జూలై 23(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల పనితీరు పక్కదారి పట్టింది. రికార్డుల్లో ఎక్కువ మంది వస్తున్నట్లు చూపుతున్నారు.. వాస్తవంగా చూస్తే అత్యల్పంగా ఉంటున్నారు. ఐసీడీఎస్ అధికారులు సమగ్రంగా పర్యవేక్షించపోవడంతో కేంద్రాలు సక్రమంగా నడవడం లేదు. అధికారులు వచ్చినప్పుడు ముందుగా తెలియడంతో అప్పటికప్పుడు కేంద్రాల నిర్వాహకులు చకచకా ఏర్పాట్లు చేసేయడం.. వారు ఎళ్లాక మళ్లీ వదిలేయడం సర్వసాధారణంగా మారింది. చలుమూరివానిపాలెం అంగన్వాడీ కేంద్రంలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు రికార్డుల్లో నమోదు చేశారు. కేంద్రంలో ఒక చిన్నారే ఉంటున్నారు. చలుమూరివానిపాలెం, చిన నల్లబిల్లి, వారాదికొంపలకు కలిపి ప్రభుత్వం ఒక అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చలుమూరివాని పాలెంలో 40 కుటుంబాలు, వారాదికొంపలో 18 కుటంబాలు, చిననల్లబిల్లి గ్రామంలో 27 కుటుంబాలు ఉన్నట్టు రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ ఇద్దరే చిన్నారులు అంగన్వాడీకి వస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఈ మూడు గ్రామాల్లో ఒక గర్భిణి, ఒక బాలింత కూడా లేరని చెబుతున్నారు. అన్ని కేంద్రాల మాదిరి ఈ కేంద్రంలోనూ పోషకాహారం అందించేందుకు, చిన్నారుల ఆలన పాలన చూడటానికి ఒక కార్యకర్తను, ఆయాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్రం వసతి కోసం అద్దె భవనాన్ని కూడా చూసింది. నిర్వహణ చూస్తే లోపభూయిష్టంగా ఉంది. మరికొన్ని గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలతో కేంద్రాలు నడుస్తున్నా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు కాని, పర్యవేక్షకులు కాని దృష్టిసారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై నీలకంఠరాజపురం సెక్టారు సూపరవైజర్ భాగ్యవతిని వివరణ కోరగా సెక్టారు పరిధిలోని 26 అంగన్వాడీ కేంద్రాల్లో 305 మంది పిల్లలు ఉన్నారని, చలుమూరివానిపాలెం కేంద్రంలో ఇద్దరే పిల్లలు ఉండగా ప్రస్తుతం ఈ కేంద్రానికి ఒక్క చిన్నారే హాజరవుతున్నట్టు ఆమె ధ్రువీకరించారు.