ఎంఎస్‌ఎంఈ విస్తరణ కేంద్రాలకు ఆమోదం
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:41 PM
జిల్లాలో ఎంఎస్‌ఎంఈ విస్తరణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంఎస్‌ఎంఈ విస్తరణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వృద్ధికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ... ఎంఎస్‌ఎంఈ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం రూపొందించిన ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ విస్తరణ కేంద్రాలను అనంతపురం, విజయనగరంలో ఏర్పాటకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. సాంకేతిక సాయం, నైపుణ్యాభివృద్ధి, ఇంక్యుబేషన్, కన్సల్టెన్సీ సేవలు వంటివి అందించడం ద్వారా ఎంఎస్‌ఎంఈలు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాయని చెప్పారు. కొత్త సంస్థల స్థాపనను ప్రోత్సహించి... స్థానికంగా ఉపాధిని కూడా సృష్టిస్తామని తెలిపారు. ఈ చొరవ స్వర్ణ 2047 సాధనకు దోహద పడుతుందని తెలిపారు. ఔత్సాహిక పెట్టుబడిదారులకు సరసమైన ధరలకు భూమి, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి ప్రభుత్వం ప్రతి ఆసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధిని వేగవంతం చేస్తోందని తెలిపారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్, స్టార్టప్‌లు, హైటెక్ సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం దొరుకుతుందన్నారు. కొత్త విస్తరణ కేంద్రాలు విశాఖపట్నంలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ మార్గదర్శకత్వంలో పని చేస్తాయని వివరించారు. హై ఎండ్ స్కిల్లింగ్ స్టిమ్యులేటర్లు, వర్చువల్ తరగతి గదులలో శిక్షణ అందిస్తామని ఆ ప్రకటనలో మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు.