Appointment Letters నియామక పత్రాలు ఎప్పుడో?
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:46 PM
Appointment Letters — When? మన్యం జిల్లా పరిధిలోని చౌక ధరల దుకాణాలకు ఎంపికైన నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. పాలకొండ, పార్వతీపురం డివిజన్ల పరిధిలో డీలర్ల నియామం కోసం గతేడాది డిసెంబరు 9న నోటిఫికేషన్ జారీ చేశారు.
గరుగుబిల్లి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా పరిధిలోని చౌక ధరల దుకాణాలకు ఎంపికైన నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. పాలకొండ, పార్వతీపురం డివిజన్ల పరిధిలో డీలర్ల నియామం కోసం గతేడాది డిసెంబరు 9న నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన వారి నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 19న పరిశీలన చేశారు. పార్వతీపురం డివిజన్‌కు సంబంధించి బలిజిపేట, గరుగుబిల్లి, కొమరాడ, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం మండలాల నుంచి 36 దుకాణాలకు 285 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 63 దరఖాస్తులు తిరస్కరించారు. అలాగే పాలకొండ డివిజన్‌కు సంబంధించి 20 చౌక ధరల దుకాణాలకు 64 మంది పరీక్షకు హాజరయ్యారు. రెండు డివిజన్ల పరిధిలో 56 డీలర్ పోస్టులకు 266 మంది పోటీ పడ్డారు. సంబంధిత అభ్యర్థులకు డిసెంబరు 21న హాల్ టిక్కెట్లు జారీ చేశారు. వీరికి 23న రాత పరీక్ష నిర్వహించి 26వ తేదీన ఫలితాలను ప్రకటించారు. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి 28న మౌఖిక పరీక్ష కూడా నిర్వహించారు. 30న ఫలితాలను ప్రకటించారు. 56 దుకాణాలకు అర్హత పొందిన వారి జాబితాను జనవరి 10న వెల్లడించారు. ఎంపికైన వారి వివరాల పరిశీలనకు సంబంధిత తహసీల్దార్లకు కూడా పంపించారు. అనంతరం అభ్యర్థుల పూర్వాపరాలను సేకరించారు.
ఎన్నికల కోడ్ రావడంతో..
నియామక పత్రాలు అందిస్తారన్న తరుణంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగి, కోడ్ కూడా ముసిగింది. నియామక పత్రాలు అందించేందుకు ప్రస్తుతం ఎటువంటి ఆటంకాలు లేవు. అధికారులు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించాలని అభ్యర్థులు కోరుతున్నారు. నియామక పత్రాల విషయమై పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని సంప్రదించగా పైనుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన త క్షణమే నియామక పత్రాలను అందిస్తామన్నారు.