Revenue Services రెవెన్యూ సేవలపై అర్జీదారులు సంతృప్తి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:20 PM
Applicants Satisfied with Revenue Services రెవెన్యూ సేవలపై అర్జీదారులు శతశాతం సంతృప్తి చెందినట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది సెప్టెంబరు 29న తొలిసారిగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటుచేసి.. జిల్లాలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టామన్నారు.
పార్వతీపురం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సేవలపై అర్జీదారులు శతశాతం సంతృప్తి చెందినట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ ఏడాది సెప్టెంబరు 29న తొలిసారిగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటుచేసి.. జిల్లాలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టాం. తొమ్మిది వారాల్లో వచ్చిన అర్జీలన్నింటినీ పరిష్కరించడానికి తహసీల్దార్లు ఎంత గానో కృషి చేశారు. ప్రస్తుతం అర్జీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫోన్‌కాల్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నాం. ఇది రెవెన్యూ క్లినిక్ సాధించిన అతిపెద్ద విజయం. జిల్లాలో ఎవరికైనా రెవెన్యూ సమస్యలుంటే వెంటనే రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలు అందించాలి. కాగా తొలి ఆరు వారాల్లో అందిన 227 ఫిర్యాదులను పరిష్కరించడమే కాకుండా అర్జీదారులకు ఫోన్ చేశాం. వారిలో 173 మంది కాల్ లిఫ్ట్ చేశారు. రెవెన్యూ సేవలపై సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 16 రకాల రెవెన్యూ సమస్యలను గుర్తించి.. పరిష్కార మార్గం చూపాం.’ అని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘గతంలో గ్రీవెన్స్‌లో అర్జీ తీసుకొని సబ్ కలెక్టర్ లేదా తహసీల్దార్‌కు ఎండార్స్ చేసేవాళ్లం. ఆ తర్వాత అది పరిష్కారం అయిందా లేదా అని సమాచారం ఉండేది కాదు. రెవెన్యూ క్లినిక్‌తో వాటికి చెక్‌పెట్టి అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.’ అని చెప్పారు. ఈసమావేశంలో డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.