Apartments on 7 floors 7 అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:41 PM
Apartments on 7 floors జిల్లాలోని విజయనగరంతో పాటు అన్ని మునిసిపాల్టీల్లో ఇక బహుళ అంతస్తులు నిర్మితం కానున్నాయి. సాధారణంగా మన జిల్లాకు సంబంధించి 18 మీటర్ల వరకూ ఐదు అంతస్తుల భవనాల(అపార్ట్‌మెంట్)కు అనుమతి ఉంది. ఇక నుంచి 24 మీటర్ల వరకూ నిర్మించుకునే అవకాశం కల్పించనుంది.
7 అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు
అనుమతి ఇవ్వనున్న ప్రభుత్వం
ప్రాథమిక చర్చల్లో ప్రస్తావన
త్వరలోనే ఆదేశాలు ఇచ్చే అవకాశం
విజయనగరం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని విజయనగరంతో పాటు అన్ని మునిసిపాల్టీల్లో ఇక బహుళ అంతస్తులు నిర్మితం కానున్నాయి. సాధారణంగా మన జిల్లాకు సంబంధించి 18 మీటర్ల వరకూ ఐదు అంతస్తుల భవనాల(అపార్ట్‌మెంట్)కు అనుమతి ఉంది. ఇక నుంచి 24 మీటర్ల వరకూ నిర్మించుకునే అవకాశం కల్పించనుంది. అంటే ఏడు అంతస్తుల వరకూ పెంచుకోవచ్చునన్నమాట. సాధారణంగా 18 మీటర్లు దాటి నిర్మాణం చేపడితే వాటిని హైరైజ్డ్ భవనాలు అంటారు. వాటికి నిబంధనలు, అనుమతులు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఆ నిబంధనలు సడలించేందుకు కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణరంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకోనుంది. దీనిపై ప్రాథమికంగా ప్రభుత్వ వర్గాల్లో చర్చలు సాగాయి. త్వరలో విశాఖ, విజయవాడ, హైదరాబాద్ నగరాల మాదిరిగా మన జిల్లాలో సైతం బహుళ అంతస్తులు అందుబాటులోకి రానున్నాయి.
జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలు ఉన్నాయి. నెల్లిమర్ల నగర పంచాయతీగా ఉంది. ఇంతవరకూ 400 గజాల్లో నాలుగు అంతస్తులు, 600 గజాల స్థలంలో ఐదు అంతస్తుల భవనాలు నిర్మించుకునేందుకు అనుమతులిచ్చేవారు. భవనాల ఎత్తును 24 మీటర్లు పెంచుకునే వెసులబాటు కల్పించడంతో ఇక ఏడు అంతస్తుల వరకూ నిర్మించుకోవచ్చు. అంతకంటే మించి స్థలం ఉంటే హైరైజ్డ్ భవనాలు నిర్మాణం చేపట్టవచ్చు. హైరైజ్డ్ నిర్మాణాలకు సంబంధించి సిటీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు, రెలా అనుమతులతో పాటు ఎయిర్‌పోర్టు, ఫైర్ డిపార్ట్‌మెంట్ల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. భూమి విలువ పెరగడంతో హైరైజ్డ్ భవనాలకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
తుది దశలో నిర్ణయం
ప్రభుత్వం ఇప్పటికే భవన అనుమతులపై ఒక నిర్ణయానికి వచ్చింది. శాసనసభలో చర్చించి అధికారికంగా ప్రకటించనుంది. బహుళ అంతస్తులు పెరగడం వల్ల నిర్మాణరంగానికి కొంత ఊతమిచ్చినట్టవుతుంది. నగరీకరణకు అవకాశం కలుగుతుంది. అయితే ఇప్పటికే విజయనగరం నగరపాలక సంస్థలో ఐదు వరకూ హైరైజ్డ్ అపార్ట్‌మెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తక్కువ స్థలంలో అదే స్థాయిలో హైరైజ్డ్ భవనాలు నిర్మించుకునేందుకు అవకాశముండడంతో బిల్డర్లు సైతం ముందుకొస్తారు. సిటీ ప్లానింగ్‌తో పాటు అనుమతుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు కొంతవరకూ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తద్వారా సామాన్య, మధ్యతరగతి వారికి ఉపశమనం దక్కుతుంది. ముఖ్యంగా వాణిజ్య సముదాయాలు పెరగనున్నాయి. తద్వారా వివిధ పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి.
నగరీకరణకు అవకాశం..
రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయనగరం ఒకటి. మునిసిపాల్టీగా ఉన్న విజయనగరాన్ని 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నగరపాలక సంస్థగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా హంగులు కల్పించే ప్రయత్నం చేసింది కానీ గత ఐదేళ్ల వైసీపీ హయాంలో నగరాభివృద్ధి పడకేసింది. కూటమి ప్రభుత్వం రావడంతో తాజాగా దృష్టిపెట్టింది. నగరీకరణకు సంబంధించి అన్ని హంగులు కల్పించాలని భావిస్తోంది. ముఖ్యంగా నగరంలో నిరుపేదలు, మధ్యతరగతి వారికి గృహనిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పథకాల ద్వారా గృహనిర్మాణానికి అన్నివిధాలా సాయం చేయాలని చూస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన కాలనీ లేఅవుట్లు, టిడ్కో గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలనుకుంటోంది. కొత్తగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాల కింద కొత్తగా ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులను ఎంపిక చేసే దిశగా అడుగులు వేస్తోంది.
-------------