Share News

apar problems ‘అపార’ అవస్థలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:42 PM

apar problems గంట్యాడ మండలం నీలావతి గ్రామానికి చెందిన శేఖర్‌ పదో తరగతి చదువుతున్నాడు. తన ఆధార్‌ కార్డులో ఉన్న ఇంటి పేరు స్పెల్లింగ్‌ తప్పుగా పడింది. విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపటడుతున్న అపార్‌ ఐడీ నమోదుకు తండ్రి, కుమారుల ఆధార్‌ కార్డులో ఇంటిపేరు ఒకే విధంగా లేకపోవడంతో ఆన్‌లైన్‌లో తీసుకోవడం లేదు

apar problems ‘అపార’ అవస్థలు
పాఠశాలలో సచివాలయం సిబ్బంది ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

‘అపార’ అవస్థలు

తప్పులు తడకలుగా నమోదైన విద్యార్థుల వివరాలు

పూర్తిస్థాయిలో కానరాని ఆధార్‌ కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా 36,047 మందికి అపార్‌ ఐడీ పెండింగ్‌

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి):

- గంట్యాడ మండలం నీలావతి గ్రామానికి చెందిన శేఖర్‌ పదో తరగతి చదువుతున్నాడు. తన ఆధార్‌ కార్డులో ఉన్న ఇంటి పేరు స్పెల్లింగ్‌ తప్పుగా పడింది. విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపటడుతున్న అపార్‌ ఐడీ నమోదుకు తండ్రి, కుమారుల ఆధార్‌ కార్డులో ఇంటిపేరు ఒకే విధంగా లేకపోవడంతో ఆన్‌లైన్‌లో తీసుకోవడం లేదు. దీంతో ముందు ఆధార్‌ కార్డు సవరించుకోవాలి. మరోవైపు పదో తరగతి పరీక్షలకు ఫీజు గడువు చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో ఆధార్‌ ఎప్పుడు సవరించుకోవాలి? ఎప్పుడు ఫీజు చెల్లించాలి? అని ఆ విద్యార్థి తండ్రి టెన్షన్‌ పడుతున్నాడు.

- బొండపల్లికి చెందిన ఓ విద్యార్థి స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి ఆధార్‌ కార్డులో ఉన్న పుట్టిన తేదికి, స్టడీ సర్టిఫికెట్‌లో నమోదైన పుట్టిన తేదీకి తేడా ఉంది. దీంతో పాఠశాలలో నమోదు చేస్తున్న అపార్‌ ఐడీ నమోదు ప్రక్రియలో విద్యార్థి వివరాలను ఆన్‌లైన్‌ తీసుకోవడం లేదు. ఈ విద్యార్థి ముందు డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ధ్రువపత్రం తీసుకోవాల్సి ఉంది. పరీక్ష ఫీజు గడువు సమీపిస్తున్న నేపథ్యంతో ఇదంతా ఎప్పుడు అవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

- విజయనగరం పట్టణంకు చెందిన మరో విద్యార్థికి కొత్త సమస్య వచ్చింది. రెండు సార్లు ఆధార్‌ సవరించినా పేరు మారకపోవడంతో విశాఖలో ఉన్న జోనల్‌ ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది.

జిల్లాలో ఇటువంటి సమస్యలనే చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. అపార్‌ కార్డుల నమోదులో ఆధార్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా గతంలో నమోదు చేసిన ఆధార్‌లో తప్పులు ఉండిపోయాయి. ఇన్నాళ్లూ వాటిని సవరించుకోలేదు. అపార్‌ ఐడీ అవసరం పడడంతో ఇప్పుడు కష్టాలు పడుతున్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికీ అపార్‌(ఆటోమేటిడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అథెంటిక్‌ రిజిస్ర్టీ) సంఖ్య అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి డిగ్రీ వరకూ చదువుతున్న విద్యార్థులందరికీ అపార్‌ నమోదు జరుగుతోంది. ప్రతి విద్యార్థికీ స్కూల్‌లో ఉన్న వివరాలు, ఆధార్‌లో ఉన్న వివరాలు ఒకేలా ఉండాలి. ఇలా ఉన్నవారికి సమస్య లేదు. కానీ చాలా మందికి భిన్నంగా ఉంటున్నాయి. ఆ విద్యార్థులంతా ఆధార్‌ నమోదు కేంద్రాలకు వెళ్లి సవరించుకున్న తరువాత అపార్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే జిల్లాలో అనుకున్న స్థాయిలో ఆధార్‌ కేంద్రాలు లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ప్రయాస పడుతున్నారు. ఆయా కేంద్రాల వద్ద సాంకేతిక సమస్యలు, పవర్‌ కట్‌ చోటుచేసుకుంటే మరింత ఆలస్యం అవుతోంది. ఆధార్‌లో వివరాలు నమోదు చేశాక అప్‌డేట్‌ కావడానికి సుమారు 10 నుంచి 15 రోజులు పడుతోంది. విద్యార్థికి ఆధార్‌లో ఇంటి పేరు, పుట్టిన తేదీ ఒకే విధంగా ఉండాలి. ఇది సక్రమంగా లేకపోతే సవరించుకోవాల్సి ఉంటుంది.

- ఒకసారి అపార్‌ కార్డు జారీ అయితే విద్యార్థి చదువు పూర్తయి, ఉద్యోగం సాధించే వరకూ ఇదే నెంబరు కొనసాగుతుంది. కేంద్రం జారీ చేస్తున్న అపార్‌ కార్డులో విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. శాశ్వత డిజిటల్‌ గుర్తింపు సంఖ్య జారీ చేస్తుంది. దేశంలో ఎక్కడ చదవాలన్నా ఉపాధి అవకాశాలకు ఎక్కడకు వెళ్లాలన్నా ఈ కార్డు కీలకం కానుంది.

జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీల్లో మొత్తం 2,69,917 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 2,33,870 మందికి అపార్‌ ఐడీ నమోదు చేశారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా 36,047 మంది విద్యార్థులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అపార్‌ కోసం వివరాలు ఈనెల 30లోగా నమోదు కావాల్సి ఉంది. ఇటీవల గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న సిబ్బందితో ప్రభుత్వ పాఠశాలల్లో 67 కిట్లతో 425 మందికి ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేశారు. మిగిలిన సమస్యలను సవరించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై డీఈవో మాణిక్యం నాయుడు వద్ద ప్రస్తావించగా అపార్‌ ఐడీ నమోదుకు ఈనెల 30 వరకు గడువు ఉందని, ఈలోగా విద్యార్థులు ఆధార్‌లో ఉన్న పొరపాట్లను సవరించుకోవాలని చెప్పారు.

Updated Date - Nov 03 , 2025 | 11:42 PM