AP should achieve 100 percent literacy ఏపీ 100 శాతం అక్షరాస్యత సాధించాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:13 AM
AP should achieve 100 percent literacy రాబోయే మూడేళ్లలో 100 శాతం అఽక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటున్నానని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఏవియేషన్ ఎడ్యుసిటీకి మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భంగా విశాఖలో మంగళవారం నిర్వహించిన ఎంఓయూ సదస్సులో ఆయన మాట్లాడారు.
ఏపీ 100 శాతం అక్షరాస్యత సాధించాలి
దానిని రాబోయే మూడేళ్లలో
మంత్రి లోకేశ్ సాధిస్తారని విశ్వసిస్తున్నా
గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు
విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
రాబోయే మూడేళ్లలో 100 శాతం అఽక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటున్నానని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఏవియేషన్ ఎడ్యుసిటీకి మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భంగా విశాఖలో మంగళవారం నిర్వహించిన ఎంఓయూ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం 14 లక్షల మంది పిల్లలను బడికి దూరం చేసిందని, అది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తంచేశారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన గోవా రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నానని, సొంత రాష్ట్రం ఏపీ కూడా అలాంటి పేరు సాధించాలని, విద్యా శాఖా మంత్రి లోకేశ్ దానిని మూడేళ్లలో సాధిస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో యంగెస్ట్ దేశమని అభివర్ణించారు. దేశంలో ఏవియేషన్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో వింటున్నానని, తలపై జుట్టు తెల్లబడింది కానీ అది సాకారం కాలేదన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మళ్లీ దానిపై ఆశలు చిగురిస్తున్నాయని, పోలవరం ప్రాజెక్టును భారతదేశం చూస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. ఎంతో వెనుకబడిన ప్రాంతంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు పేరును ఇప్పుడు అదే ప్రాంతంలో నిర్మిస్తున్న అధునాతన అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడుతున్నారంటే అంతకంటే అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నించారు. ఇది ఉత్తరాంధ్ర భావితరాలకు సందేశంగా నిలుస్తుందన్నారు. విజయనగరం పూసపాటి రాజుల కుటుంబం నుంచి ఏవియేషన్ రంగంలోకి వెళ్లిన అలక్ నారాయణ్ పైలట్‌గా పనిచేశారని, ఆయన పేరుతోనే మాన్సాస్ విద్యా సంస్థల ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇంతకు ముందు చంద్రబాబునాయుడు, ఎర్రన్నాయుడు, తాను కలిసి టీమ్ వర్క్‌తో పనిచేశామని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతలను లోకేశ్, రామ్మోహన్‌నాయుడు, అదితిలకు అప్పగించామన్నారు. ఎడ్యుసిటీ ప్రపంచానికి నిపుణులను అందిస్తుందని, వారంతా మాతృదేశం గురించి అక్కడ గొప్పగా చెప్పాలని, ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా...పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అంటూ గేయం ఆలపించి అందరినీ ఉద్వేగభరితులను చేశారు.