Share News

ap fiber doesnot proper working ఏపీ ఫె‘ౖబోర్‌’

ABN , Publish Date - Jun 21 , 2025 | 11:53 PM

ap fiber doesnot proper working

ap fiber doesnot proper working ఏపీ ఫె‘ౖబోర్‌’
తరచూ ఇలా ఆగుతూ...

ఏపీ ఫె‘ౖబోర్‌’

సేవల్లో తరచూ అంతరాయం

విసిగిపోతున్న వినియోగదారులు

నెలలో సగం రోజులే సేవలు

ప్రైవేటు ఫైబర్‌ వైపు దృష్టిపెడుతున్న వైనం

సరిదిద్దని కూటమి ప్రభుత్వం

ప్రజలకు అత్యంత చౌకగా నెట్‌, ఫ్రీ కాలింగ్‌, కేబుల్‌ సదుపాయం అందించే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన ఫైబర్‌ నెట్‌ జిల్లాలో సంతృప్తికర సేవలు అందివ్వడం లేదు. తరచూ ఆగిపోవడం, నెట్‌ నెమ్మదించడం జరుగుతోంది. ఈ పరిస్థితి కొన్ని నెలలుగా నెలకొంది. వైసీపీ ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ను పూర్తిగా విస్మరించింది. సేవలను మెరుగుపరచకపోగా ఎక్కడికక్కడ ఆగిపోయినా పట్టించుకోలేదు. కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో జిల్లాలో 2020 నాటికి 40 వేల వరకూ కనెక్షన్లు ఉండగా 2024 వచ్చేసరికి 18 వేలకు పడిపోయింది. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇంకా గాడిన పడలేదు. దీంతో వినియోగదారులు విసుగెత్తిపోతున్నారు. కొందరు ఇతర ప్రైవేటు ఫైబర్‌ సేవల్లోకి మారిపోతున్నారు.

- రాజాంకు చెందిన అసిరినాయుడు ఓ వార్డు సచివాలయంలో తల్లికివందనం గ్రీవెన్స్‌ కోసం వెళితే కంప్యూటర్‌ తెరపై సర్వర్‌ డౌన్‌ అని చూపించింది. దీంతో అక్కడున్న సిబ్బంది తమ సెల్‌ఫోన్‌కు వైఫై కనెక్ట్‌ చేసి దరఖాస్తుల నమోదు చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే నిత్యం ఫైబర్‌ నెట్‌తో ఇబ్బందులు తప్పడంలేదన్నారు.

- రాజాం మెయిన్‌రోడ్డులో ఉంటున్న శివ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా నుంచి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో విధులు నిర్వహిస్తున్నాడు. అతనింటికి ఏపీ ఫైబర్‌ నెట్‌ అందుబాటులో ఉంది. నెలలో సగం రోజులు సాంకేతిక సమస్యలు ఏర్పడేవి. విజయనగరంలోని ఫైబర్‌ నెట్‌ ప్రతినిధులకు ఫోన్‌చేస్తే వారు పట్టించుకోలేదు. దీంతో శివ జియో ప్రైవేట్‌ ఫైబర్‌నెట్‌కు మారిపోయాడు.

- రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉంటున్న వ్యాపారి కృష్ణారావు ఏపీ ఫైబర్‌ నెట్‌ పెట్టుకుంటే ఇంట్లో సెల్‌ఫోన్లకు డేటాతో పాటు టీవీకి, ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు ఉచితంగా సేవలందుతాయని భావించాడు. కానీ అందుకు భిన్నంగా జరుగుతోంది. నెలలో సగం రోజులు కూడా పనిచేయకపోవడంతో ఇటీవల ప్రైవేటు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ తీసుకున్నాడు.

రాజాం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఫైబర్‌ నెట్‌ సేవలు నిరాశకు గురిచేస్తున్నాయి. దాదాపు ప్రతిరోజూ అంతరాయం కలుగుతోంది. ప్రారంభంలో మెరుగైన సేవలందించినా క్రమేపీ నిర్వహణ అబాసుపాలవుతోంది. దీనివల్ల పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ వినియోగదారులు ప్రైవేటు ఫైబర్‌ నెట్‌ సేవల్లోకి మారిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతున్నా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. జిల్లాలో గృహాలకు సంబంధించి 18 వేల నుంచి 20 వేల ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా కేంద్రంలోనే అధిక కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తోడు ప్రభుత్వపరంగా సచివాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి మరో 2 వేల వరకూ సర్వీసులు ఉన్నాయి. వాటికి కూడా నిరంతరాయంగా సేవలు అందించడంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ విఫలమవుతోంది. దీంతో వినియోగదారులు నిరాశ పడుతున్నారు. దాదాపు అన్ని పట్టణాలు, మునిసిపాల్టీల్లో ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రైవేటు సంస్థల కనెక్షన్లు పెరుగుతున్నాయి.

టీడీపీ హయాంలోనే తెరపైకి

టెక్నాలజీకి అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటికీ నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. ఇంటర్నెట్‌, కేబుల్‌, ల్యాండ్‌ ఫోన్‌ సేవలను అతి తక్కువ ధరకు ప్రజలకు అందించడమే లక్ష్యంగా 2017లో ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రారంభించారు. వాస్తవానికి ఈ మూడు సేవలను విడివిడిగా సర్వీస్‌ ప్రొవైడర్లు అందించేవి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు ఉంటుందని భావించి కొత్త విధానం తెరపైకి తెచ్చారు. విద్యుత్‌ శాఖతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా హైస్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటుచేశారు. రూ.149లకే బేసిక్‌ ప్లాన్‌ అందుబాటులోకి తేవడంతో అనతికాలంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. అయితే ఏపీ ఫైబర్‌ నెట్‌తో కేబుల్‌ వ్యవస్థ ఎక్కడ దెబ్బతింటుందోనని ఆపరేటర్లు ఆందోళన చెందారు. ఫైబర్‌ కనెక్షన్ల పట్ల విముఖత చూపారు. అందుకే పట్టణాలు, సమీప గ్రామాలకే ఏపీ ఫైబర్‌ నెట్‌ పరిమితమైంది. ఆపై 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ బేసిక్‌ ప్లాన్‌ను రూ.149 నుంచి ఏకంగా రూ.350కు పెంచింది. పైగా ఫైబర్‌ నెట్‌ నిర్వహణను గాలికి వదిలేయ్యడంతో సేవలకు అంతరాయం కలిగింది. ఆపై వినియోగదారుల సంఖ్య తగ్గింది. జిల్లాలో 2020 నాటికి 40 వేల వరకూ కనెక్షన్లు ఉండగా.. 2024 నాటికి వచ్చేసరికి 18 వేలకు పడిపోయింది.

టారిఫ్‌లు అందుబాటులో ఉన్నా..

వాస్తవానికి ఏపీ ఫైబర్‌ నెట్‌ టారిఫ్‌ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. రూ.349లకు సంబంధించి ప్రైవేటు సంస్థలతో పోల్చుకుంటే తక్కువే కానీ 100 ఎంబీబీఎస్‌ నెట్‌ స్పీడు ఉంటేనే సేవలు సాధ్యమయ్యేది. తరచూ నెట్‌కు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నెట్‌ వర్క్‌ సక్రమంగా ఉండడం లేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విస్తరించే పనులేవీ చేయలేదు. కేవలం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రవేశపెట్టారన్న ఒకేఒక కారణంతో నిర్లక్ష్యంగా విడిచిపెట్టారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో గాడిన పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నెట్‌వర్క్‌ పెంచడం, సాంకేతిక సమస్యలు తగ్గించడం, బేసిక్‌ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వేగంగా జరగడం లేదు. దీనివల్ల వినియోగదారులు నిరాశ పడుతున్నారు. నెట్‌ సర్వీసు సంస్థలను మార్చుకుంటున్నారు.

విసిగిపోయాం..

ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవల్లో అంతరాయంతో విసిగిపోయాం. ఇంటర్నెట్‌, కేబుల్‌, ల్యాండ్‌ ఫోన్‌ సౌకర్యం కలుగుతుందని చెప్పి ఏపీ ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ తీసుకున్నాం. రూ.149ల బేసిక్‌ ప్లాన్‌ను రూ.350కు పెంచారు. ఆపై నిర్వహణ సరిగ్గా లేదు. నెట్‌వర్క్‌ పూర్తిగా పడిపోయింది. దీంతో ఎప్పుడు సేవలు నిలిచిపోతాయో తెలియడం లేదు. అందుకే గతం మాదిరిగా విడివిడిగా మూడింటికీ వేరే ప్రొవైడర్‌ సేవలు తీసుకున్నాం.

- పెంకి శివకుమార్‌, వస్త్రపురి కాలనీ, రాజాం

త్వరలో మెరుగ్గా సేవలు

ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు విస్తృతం కానున్నాయి. జిల్లాలో గతంలో కంటే నెట్‌ సేవలు తగ్గినప్పటికీ మెరుగు పరిచే ప్రణాళికతో ప్రభుత్వం ఉంది. సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు తక్కువ ధరకు బేసిక్‌ ప్లాన్‌ అందుబాటులోకి తేనుంది. ప్రతి గ్రామానికీ ఫైబర్‌ నెట్‌ సేవలు విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన అవకతవకలను తేల్చేందుకు విజిలెన్స్‌ దర్యాప్తు సాగుతోంది. అవి తేలాక మరింత వేగంగా సేవలు విస్తరించనున్నాయి.

- రవి, ఇంజనీరు, ఏపీ ఫైబర్‌ నెట్‌, విజయనగరం

Updated Date - Jun 21 , 2025 | 11:53 PM