తీరంపై నిఘా ఏదీ?
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:19 AM
జిల్లాలోని సముద్ర తీరంపై నిఘా కొరవడింది. దేశాలను దాటి మన జలాల్లోకి విదేశీ మత్స్యకారులు చేరుకుంటున్నా నిఘా వ్యవస్థ గుర్తించలేకపోతుంది.
- జిల్లా సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్న విదేశీ మత్స్యకారులు
- తీరానికి చేరుకునే వరకూ గుర్తించలేకపోతున్న వైనం
-బయట పడుతున్న భద్రత డొల్లతనం
- మెరైన్ పోలీసుల గస్తీ అంతంతమాత్రమే
- రెండు రోజుల కిందట ఎచ్చెర్ల మండలం మూసవానిపేట తీరానికి 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు చేరుకున్నారు. కొద్దిరోజుల కిందట చేపలవేటకు బయలుదేరిన వీరు సముద్రంలో తుఫాను నేపథ్యంలో దారి తప్పారు. చివరకు ఒడిశా మీదుగా మూసవానిపేట తీరానికి చేరుకున్నారు. బోటును లంగరు వేశారు. బెంగాళీ భాషలో మాట్లాడుతుండడంతో స్థానిక మత్స్యకారులు ఎచ్చెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి 13 మంది మత్స్యకారులను కళింగపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
- 2008 నవంబరు 19న 17 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు బోటులో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరానికి వచ్చారు. దారి తప్పి రావడంతో అప్పట్లో ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టుచేశారు. అనంతరం కోర్టు తీర్పుతో పోలీసుల సంరక్షణలో ఉన్న వీరు కనిపించకుండా పోయారు. అప్పట్లో అదొక సంచలనం. వారు కనిపించకపోయేసరికి జిల్లా పోలీస్ శాఖకు ఒక మాయని మచ్చగా నిలిచింది.
రణస్థలం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సముద్ర తీరంపై నిఘా కొరవడింది. దేశాలను దాటి మన జలాల్లోకి విదేశీ మత్స్యకారులు చేరుకుంటున్నా నిఘా వ్యవస్థ గుర్తించలేకపోతుంది. స్థానిక మత్స్యకారులు సమాచారం ఇచ్చేవరకు కూడా విదేశీ మత్స్యకారులు వచ్చిన విషయం తెలియడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే జిల్లా మత్స్యకారులు సరిహద్దు జలాలను దాటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా వంటి దేశాల వైపు వెళ్తే వారు సముద్ర జలాల్లో ఉంటుండగానే అక్కడి కోస్టుగార్డులు, రాష్ట్రాల మెరైన్ సిబ్బంది అదుపులోకి తీసుకుంటున్నారు. కానీ, మన దగ్గర మాత్రం విదేశీ మత్స్యకారులు తీరానికి వచ్చిన వరకు కూడా గుర్తించలేకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ 193 కిలోమీటర్ల సుదూర సముద్ర తీర ప్రాంతం ఉంది. మొత్తం 11 తీర మండలాలు ఉన్నాయి. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో 120 వరకూ మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. తీర ప్రాంత పరిరక్షణ మెరైన్ పోలీసుల బాధ్యత. కానీ, జిల్లాలో కేవలం భావనపాడు, కళింగపట్నం, బారువలో మాత్రమే మెరైన్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. సిబ్బంది అరకొరగానే ఉన్నారు. తీరంలో గస్తీకి ఆధునిక పరికరాలు లేవు. దీంతో క్రైమ్, ఇతరత్రా పోలీస్ సిబ్బందే అత్యవసర సమయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మరికొన్ని చోట్ల మెరైన్ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అవి ప్రతిపాదనలతోనే ఉండిపోయాయి. ఒక్కో మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు ఏఎస్‌ఐలతో పాటు ఇతర సిబ్బంది 40 మంది వరకూ ఉండాలి. కానీ ఏ స్టేషన్‌లో కూడా పది మంది సిబ్బంది కూడా లేరు. కొద్దిరోజుల కిందట తీర ప్రాంతంలో పర్యటించిన మెరైన్ డీఐజీ జిల్లాలో మెరైన్ పోలీస్‌స్టేషన్ల సంఖ్య పెంచుతామని ప్రకటించారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. దీంతో తీర ప్రాంత భద్రతలో ఎప్పటికప్పుడు డొల్లతనం బయటపడుతోంది.
అరకొర వసతులు..
తీరంలో గస్తీ కోసం ఎటువంటి పరికరాలు, యంత్రాలు లేవు. వాస్తవానికి తీరంలోని మూడు కిలోమీటర్ల వరకూ మెరైన్ పోలీసులే గస్తీ కాయాలి. కానీ, వారు తీరానికే పరిమితమైపోతున్నారు. ఆధునిక బైనాక్యులర్లు లేవు. తీరంలో వెళ్లేందుకు, పర్యవేక్షించేందుకు బోట్లు సైతం లేవు. సముద్రంలో మత్స్యకారులు చిక్కుకున్నప్పుడు, సముద్ర స్నానాలకు దిగి ప్రజలు గల్లంతైనప్పుడు మెరైన్ పోలీసులు మత్స్యకారులపైనే ఆధారపడుతున్నారు. వారి బోట్లకు ఆయిల్ పోసుకొని ఆచూకీకి వెతుకుతున్నారు. కొన్నేళ్ల కిందట ప్రభుత్వం రూ.5 కోట్లతో అత్యాధునిక బోట్లు మంజూరు చేసింది. కానీ నిర్వహణ సరిగ్గా లేక ఆ బోట్లు మూలకు చేరాయి. ప్రస్తుతం భావనపాడు మెరైన్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రస్తుతం ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అటు మెరైన్ సిబ్బందితో పాటు సాధారణ పోలీసులకు తీర ప్రాంత రక్షణ బాధ్యతలు అప్పగించారు. అటు తీరంలో మత్స్యకారులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. కొత్తవారు కనిపిస్తే పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందించాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెరైన్ పోలీస్‌స్టేషన్లను బలోపేతం చేయడంతో పాటు సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
భద్రతకు పెద్దపీట
జిల్లాలో తీర ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. సాధారణ, మెరైన్ పోలీసులతో కలిపి మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారమందించాలని సూచిస్తున్నాం. జిల్లాలోని తీర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది.
బి.ప్రసాద్, మెరైన్ సీఐ, కళింగపట్నం
===========
బంగ్లా మత్స్యకారులకు రిమాండ్
శ్రీకాకుళం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశ్ మత్స్యకారులకు 15 రోజుల రిమాం డ్‌ను న్యాయాధికారి విధించారు. ఎచ్చెర్ల మండలం బడివానిపేట పంచాయతీ మూసవానిపేట సముద్ర తీరంలోకి ప్రవేశించిన బంగ్లా దేశ్‌కు చెందిన 13 మంది మత్స్యకారులను ఆదివారం కళింగపట్నం మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిపై ఇండియన్ మారిటైమ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. సోమవారం నరసన్నపేట జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా ఈ నెల 15 వరకు రిమాండ్‌ను న్యాయాధికారి విధించారు. ఈమేరకు వారిని నరసన్నపేట సబ్ జైలుకు తరలించారు.