Share News

‘ఉపాధి’పై పర్యవేక్షణ ఏదీ?

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:55 PM

వలసల నియంత్రణకు, కూలీలకు ఉపాధి, రైతులకు చేయూతనందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తోన్న ఉపాధి హామీ పథకంపై పర్యవేక్షణ కొరవడుతోంది.

      ‘ఉపాధి’పై పర్యవేక్షణ ఏదీ?

- సమయపాలన పాటించని వేతనదారులు

- సొంత పనుల్లో ఫీల్డ్‌అసిస్టెంట్లు

- పట్టించుకోని అధికారులు

- ఇంకా వైసీపీ ప్రభుత్వ జాఢ్యమే

-రాజాం మండలంలోని ఓ గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశంలో వేతనదారులు ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పని ప్రదేశంలో కాస్తా ఉపశమనం పొందేందుకు కూర్చుంటే ఫర్వాలేదు. కానీ చాలాచోట్ల ఇలా గంటల తరబడి కూర్చోవడం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ఫీల్డ్‌ అసిస్టెంట్లు పర్యవేక్షించడం లేదు. ఫలితంగా పథకం లక్ష్యం దెబ్బతింటోంది.

రాజాం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): వలసల నియంత్రణకు, కూలీలకు ఉపాధి, రైతులకు చేయూతనందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తోన్న ఉపాధి హామీ పథకంపై పర్యవేక్షణ కొరవడుతోంది. కొన్నిచోట్ల ఫీల్డ్‌ అసిస్టెంట్లు, అధికారుల నిర్లక్ష్య వైఖరితో పథకం లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలో 6.85 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. 3.85 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. అయితే, చాలా గ్రామాల్లో ఉపాధి వేతనదారులు సమయపాలన పాటించడం లేదు. పని ప్రదేశానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉపాధి హామీ పనుల్లో క్షేత్ర సహాయకులు కీలకం. గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించడం, మస్టర్ల కేటాయింపు, కొత్త జాబ్‌కార్డుల మంజూరు, ఆధార్‌ అనుసంధానం, కూలీలకు వసతులు కల్పించడం వీరి ప్రధాన విధి. కానీ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సరిగ్గా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్‌ మేట్లకు పనులు అప్పగించి వారు సొంత పనులు చూసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా పనులు చేపట్టే వేతనదారుల బృందానికి సంబంధించి.. ఒక్కో మేట్‌ నేతృత్వంలో ఒక్కోలా వేతనాలు వస్తుండడంతో కొన్ని గ్రామాల్లో వివాదాలు కూడా నెలకొంటున్నాయి. కొన్ని గ్రామాల్లో వేతనదారులు సమయపాలన పాటించడం లేదని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఉదయం గంట, సాయంత్ర గంట పనిచేసి చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే నిత్యం సమీక్షలు, సమావేశాలతో హడావుడి చేసే అధికారులకు ఇవేవీ పట్టకపోవడం విశేషం.

రికవరీ లేదు..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం అవినీతిమయంగా మారింది. గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టినట్టు సామాజిక తనిఖీ ప్రజా వేదికల్లో వెల్లడైంది. కానీ, రికవరీ మాత్రం శూన్యం. 2021-22లో జగనన్న పచ్చతోరణాల పథకం నిధులను అధికారులతో పాటు సిబ్బంది పక్కదారి పట్టించారు. మొక్కల కొనుగోలు, సంరక్షణ పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. ఉపాధి పథకం దాని అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కంప్యూటర్‌ శిక్షణ పేరిట లక్షలాది రూపాయలు మింగేశారు. అప్పట్లో అర్హత లేనివారిని సైతం ఏపీడీలుగా నియమించారు. వారికి పదోన్నతులు సైతం కల్పించారు. రైతుల పంట పొలాలకు రోడ్లు పేరిట భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ప్రజోపయోగం లేని పనులకు పెద్దపీట వేశారు. ఒక పనిచేయాల్సిన చోట రెండు, మూడు పనులు చేపట్టి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవినీతికి చెక్‌ పడుతుందని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. కొంతమంది అధికారులు, సిబ్బంది ఇప్పటికీ చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికార కూటమి ప్రజాప్రతినిధులు సైతం దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌, పంచాయతీ కమిషనర్‌లకు ఫిర్యాదులు వెల్లువెత్తినా సీరియస్‌ యాక్షన్‌లోకి దిగిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కూటమి పాలకులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

పర్యవేక్షణ పెంచుతాం

ఉపాధి హామీ పథకం పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ పెంచుతాం. వేతనదారులు పని ప్రదేశానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోతామంటే కుదరదు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా వారితో పనిచేయించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఆదేశిస్తున్నాం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు.

-ఎన్‌.రమామణి, ఇన్‌చార్జి ఏపీడీ, రాజాం

Updated Date - Jul 01 , 2025 | 11:55 PM