Share News

Another unique recognition for the Bobbili Veena బొబ్బిలి వీణకు మరో విశిష్ట గుర్తింపు

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:25 PM

Another unique recognition for the Bobbili Veena అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందిన బొబ్బిలి వీణకు మరో విశిష్ట గుర్తింపు లభించింది. వన్‌ డిస్ర్టిక్ట్‌- వన్‌ ప్రొడక్టు(ఓడీఓపీ) కింద ఎంపికైంది. రాష్ర్టానికి చెందిన ఏడు జిల్లాల ఉత్పత్తులు ఎంపిక కాగా అందులో మన బొబ్బిలికి చెందిన నమూనా వీణ (గిఫ్ట్‌ వీణ) ఉండడం విశేషం. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొత్తఢిల్లీలోని ప్రగి మైదానంలో భారత్‌ మండపంలో సోమవారం జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ ఓడీఓపీ అవార్డును అందుకోనున్నారు.

Another unique recognition for the Bobbili Veena బొబ్బిలి వీణకు మరో విశిష్ట గుర్తింపు
బొబ్బిలి వీణ

బొబ్బిలి వీణకు మరో విశిష్ట గుర్తింపు

ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ఎంపిక

హర్షం వ్యక్తం చేస్తున్న కళాకారులు

నేడు ఢిల్లీలో అవార్డు అందుకోనున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

బొబ్బిలి/విజయనగరం కలెక్టరేట్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందిన బొబ్బిలి వీణకు మరో విశిష్ట గుర్తింపు లభించింది. వన్‌ డిస్ర్టిక్ట్‌- వన్‌ ప్రొడక్టు(ఓడీఓపీ) కింద ఎంపికైంది. రాష్ర్టానికి చెందిన ఏడు జిల్లాల ఉత్పత్తులు ఎంపిక కాగా అందులో మన బొబ్బిలికి చెందిన నమూనా వీణ (గిఫ్ట్‌ వీణ) ఉండడం విశేషం. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొత్తఢిల్లీలోని ప్రగి మైదానంలో భారత్‌ మండపంలో సోమవారం జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ ఓడీఓపీ అవార్డును అందుకోనున్నారు.

బొబ్బిలి రాజుల సంస్థానంలో వీణల తయారీ కళాకారులను అమితంగా ప్రోత్సహించేవారు. ఆనాడే వీణల తయారీకి పునాది పడింది. తర్వాత రోజుల్లో దేశవిదేశాల్లో ఈ వీణ కొలువుదీరింది. ఇప్పటికీ విదేశస్థులు సైతం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఎన్‌ఆర్‌ఐల ఇళ్లలోనూ బొబ్బిలి వీణ కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షునిగా పనిచేసిన బిల్‌క్లింటన్‌ మదిని సైతం ఈ వీణ గెలుచుకుంది. వీణల తయారీ కళాకారులు వైట్‌హౌస్‌ (శ్వేతభవానికి)కు రావాలని క్లింటన్‌ అప్పట్లో ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ సరస్వతి వీణగా పిలిచే బొబ్బిలి వీణ సప్తస్వరాలను పలికించడంలో ప్రత్యేకతను చాటుకుంది. సరస్వతీ వీణలను గిఫ్ట్‌వీణలుగా తయారు చేసి ప్రభుత్వ పరంగా అతిథులకు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. టీటీడీ కార్యక్రమాలు, ఉభయ తెలుగురాష్ర్టాల్లో జరిగే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, సదస్సుల్లో బొబ్బిలి వీణ(గిఫ్ట్‌ వీణ) లను అందజేస్తున్నారు.

- తపాలా శాఖ తమ స్వర్ణోత్సవాల్లో భాగంగా బొబ్బిలి వీణ బొమ్మలతో తపాళాబిళ్లలు, నాణాలను ముద్రించింది. బొబ్బిలి వీణకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపును ఇదివరకే ప్రకటించింది. పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ పరిశోధన చేశారు.

- బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన వీణల తయారీ కేంద్రం ఉంది. వీణల తయారీ ద్వారా సుమారు 300 కుటుంబాల వారు జీవనోపాధి పొందుతున్నారు. బాడంగి మండలం వాడాడ గ్రామంలో కూడా వీణల తయారీ కళాకారులు ఉన్నారు. వారు కూడా బొబ్బిలి వీణలనే తయారు చేస్తుంటారు.

- వీణల తయారీకి పనస చెట్టుకు చెందిన కలపను వాడుతుంటారు. అయితే ఈ పనస కలప సేకరణ పెద్ద సమస్యగా మారింది. విస్తృత స్థాయిలో కలప అందుబాటులో లేదు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం ఆర్థిక భారం. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పందించి వీణల తయారీకి అవసరమైన కలపను ఉత్తరాంధ్ర ప్రాంతంలో విరివిగా పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

హర్షనీయం

బేబీనాయన, ఎమ్మెల్యే, బొబ్బిలి

బొబ్బిలి వీణకు వన్‌ డిస్ర్టిక్ట్‌- వన ప్రొడక్టు కింద ఎంపిక కావడం హర్షనీయం. గతంలో భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. దేశవిదేశాల్లో ఎంతోమంది ప్రముఖులను విశేషంగా ఆకట్టుకున్న బొబ్బిలి వీణ తయారీ వెనుక తమ పూర్వీకుల ప్రోద్బలం, కృషి ఉంది. ఈ కళాకారులను ప్రత్యేకించి తంజావూరు పంపించి తమ తాత శిక్షణ ఇప్పించారు. అసెంబ్లీలోనూ కళాకారుల సమస్యలను ప్రస్తావించాను. తాజాగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో బొబ్బిలి వీణకు మరింత ప్రాచుర్యం లభిస్తుంది.

Updated Date - Jul 13 , 2025 | 11:25 PM