Another twist in the CBM school site dispute సీబీఎం స్కూలు స్థల వివాదంలో మరో మలుపు
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:55 PM
Another twist in the CBM school site dispute బొబ్బిలి పట్టణ పరిధిలోని సీబీఎం బాలికల హైస్కూలు స్థల వివాదం మరో మలుపు తిరిగింది. కోర్టు కేసు నడుస్తున్న భూమిలో శనివారం పట్టణానికి చెందిన తూముల భాస్కరరావు, కార్తీక్ తదితరులు భూమి పూజ చేయడం ఏమిటని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.
సీబీఎం స్కూలు స్థల వివాదంలో
మరో మలుపు
భూమి పూజ నిర్వహించిన కొనుగోలుదారు
హైస్కూలు ముందు ధర్నా చేసిన ప్రజాసంఘాలు
బొబ్బిలి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి పట్టణ పరిధిలోని సీబీఎం బాలికల హైస్కూలు స్థల వివాదం మరో మలుపు తిరిగింది. కోర్టు కేసు నడుస్తున్న భూమిలో శనివారం పట్టణానికి చెందిన తూముల భాస్కరరావు, కార్తీక్ తదితరులు భూమి పూజ చేయడం ఏమిటని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. వారి వివరాల మేరకు..
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సీబీఎం బాలికల హైస్కూల్‌ను ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా ఎత్తివేశారు. అక్కడి విద్యార్థులందరినీ వేరే చోటుకు తరలించారు. కార్యాలయంలో ఒక్క హెచ్‌ఎం మాత్రమే పనిచేస్తున్నారు. తనను వేరే స్కూలుకు డెప్యుటేషన్‌పై నియమించాలని ఆమె విద్యాశాఖాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ తరుణంలో శనివారం తూముల భాస్కరరావు, కార్తీక్ అక్కడ భూమి పూజ చేస్తున్న విషయం తెలుసుకున్న ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జనసేన నాయకుడు పాలూరు బాబు, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కోట అప్పన్న, రవికుమార్, ఎంఆర్‌పీఎస్ నాయకుడు కాగాన సునీల్‌కుమార్, సీబీఎన్‌సీ సంఘంలోని కమిటీ సభ్యులు అదృష్టకుమార్, గొంటి వేణు తదితరులు కలిసి స్కూలు ముందు ధర్నా చేశారు. కోర్టులో కేసు ఉండగా భూమిపూజ చేయడం కోర్టు ధిక్కారమవుతుందని అన్నారు. చారిత్రాత్మకమైన ఈ సొత్తు ఏ ఒక్కరిదో కాదని, బొబ్బిలి ప్రజల ఆస్తి అని, దీంతో స్థానికులకు ప్రత్యేక ఆత్మీయానుబంధం ఉందన్నారు. జేసీ ఉత్తర్వులకు భిన్నంగా, కోర్టుధిక్కారణకు పాల్పడుతూ అక్రమ కట్టడాలకు పూనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ధర్నాలో ప్రజాసంఘాల నాయకులు మునకాల శ్రీనివాసరావు, వేమిరెడ్డి లక్ష్మునాయుడు, సునీల్, బీజేపీ, జనసేన నాయకులు అనిల్ కుమార్ యాదవ్, భవిరెడ్డి మహేశ్, సీబీఎన్‌సీ బ్రదర్స్ అదృష్ణకుమార్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు.
సీబీఎం స్కూలు ఆస్తిపై సర్వహక్కులూ మావే
తూముల భాస్కరరావు, కార్తీక్
భూబదలాయింపు పద్ధతిలో రిజిస్ర్టేషన్ ద్వారా వచ్చిన సీబీఎం స్కూలు ఆస్తిపై సర్వహక్కులు మాకున్నాయి. కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆంక్షలు వెలువడలేదు. సీబీఎన్‌సీ విభాగాలలో పనిచేసే వారిలో వారు ఇతర జిల్లాలకు చెందిన ఆస్తులపై వేసుకున్న కేసులపై కోర్టు తీర్పులు వెలువడ్డాయి తప్ప బొబ్బిలి సీబీఎం స్కూలుపై ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేవు. మా సొంత ఆస్తికి సంబంధించి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. స్కూలును ఎత్తివేసిన తరువాతే మా ఆస్తిపైకి మేము వెళుతున్నాం. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు.