Share News

ప్రాజెక్టుల ఆధునికీకరణకు మరో మూడేళ్లు

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:02 PM

జిల్లాలో పూర్తిస్థాయిలో భూములకు సాగునీరందాలంటే ప్రాజెక్టుల ఆధునికీకరణ ఎంతో అవసరం.

 ప్రాజెక్టుల ఆధునికీకరణకు మరో మూడేళ్లు
ఆధునికీకరణ కోసం ఎదురు చూస్తున్నపెద్దగెడ్డ ప్రాజెక్టు

- 2028 వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం

- జిల్లాలో నాలుగు ప్రాజెక్టులకు కలగనున్న మోక్షం

- పాత రేట్లతో పనులు చేయలేమంటున్న కాంట్రాక్టర్లు

జియ్యమ్మవలస, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పూర్తిస్థాయిలో భూములకు సాగునీరందాలంటే ప్రాజెక్టుల ఆధునికీకరణ ఎంతో అవసరం. ఈ విషయంలో 2014 తరువాత టీడీపీ ప్రభుత్వం చొరవ చూపి జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేటివ్‌ ఏజెన్సీ (జైకా)తో మాట్లాడి నిధులు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంది. దీని ఫలితంగా 2019 జనవరిలో జైకా నిధులు మంజూరయ్యాయి. దీంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరింది. అయితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని మరొకసారి జైకా ముందు ప్రస్తావించింది. ఫలితంగా ప్రాజెక్టుల ఆధునికీకరణకు 2028 జూలై 6వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జైకా ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర నీటి పారుదల, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు-2 (అపిలిప్‌-2) సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి. పూర్తి పర్యవేక్షణ బాధ్యత మాత్రం అపిలిప్‌-2దే.

ఇదీ ప్రాజెక్టుల పరిస్థితి

జిల్లాలో వట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంది. 2018లో జైకా ఇంజనీర్ల బృందం ఈ ప్రాజెక్టులను పరిశీలించి రూ.153.83 కోట్లు మంజూరు చేసింది. కానీ, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల తాత్సారంతో ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగాయి. చివరికి గడువు కూడా ముగిసిపోయింది. అయితే, ఈ గడువును తాజాగా మరో మూడేళ్లు పెంచడంతో కొందరు కాంట్రాక్టర్లు పాత రేట్లతో పనులు చేయలేమని నీటి పారుదలశాఖ అధికారులకు చెబుతున్నట్లు బోగట్టా. మరి దీనిపై ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.

వట్టిగెడ్డ

ఈ ప్రాజెక్టు జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ పంచాయతీ రావాడ గ్రామానికి ఆనుకొని ఉంది. దీని కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 16,680 ఎకరాలకు సాగునీరందించేలా నిర్మించారు. ఆధునికీకరణకు 2019 జనవరి 8న రూ. 44.85 కోట్లతో పరిపాలనా ఆమోదం, 2020 ఆగస్టు 19న సాంకేతిక ఆమోదం లభించాయి. ఈ పనులను శ్రీసాయి కనస్ట్రక్షన్‌(విజయవాడ) దక్కించుకుంది. 2023 జనవరి 7 నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పింది. అయితే, పనులు నత్తనడకన జరగడంతో మళ్లీ 2024 జూలై 7 నాటికి పూర్తి చేస్తామని అంగీకరించింది. అప్పటివరకు 15 శాతం పనులే జరిగాయి. చేసిన పనులకు బిల్లులు అందకపోవడంతో కాంట్రాక్టర్‌ చేతులెత్తేశాడు.

పెదంకలాం

ఈ ప్రాజెక్టు సీతానగరం మండలం పెదంకలాం వద్ద ఉంది. దీనిద్వారా బలిజిపేట మండలంలో 6,617.16 ఎకరాలకు, విజయనగరం జిల్లా వంగర మండలంలో 1,636.31 ఎకరాలకు మొత్తం 8,253.47 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రాజెక్టు ఆధునికీకరణకు 2019 ఫిబ్రవరి 15న రూ.17.30 కోట్లతో పరిపాలనా ఆమోదం, 2020 జూన్‌ 22న సాంకేతిక ఆమోదం లభించాయి. ఈ పనులు చేపట్టేందుకు తెలంగాణకు చెందిన ఎస్‌కేఆర్‌ కనస్ట్రక్షన్స్‌, రాజ్‌పద్మ ఇన్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ముందుకు వచ్చాయి. 2023 డిసెంబరు 31లోగా పనులు పూర్తి చేస్తామని అంగీకరించాయి. అయితే కేవలం 5 శాతం పనులే చేపట్టాయి. ఆ తరువాత బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ముఖం చాటేశారు.

వెంగళరాయసాగర్‌

ఈ ప్రాజెక్టు సాలూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో సువర్ణముఖి నదిపై ఉంది. దీని ద్వారా మక్కువ మండలంలో 14,550 ఎకరాలు, సీతానగరం మండలంలో 3,723 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో 6,127 ఎకరాలు మొత్తం 24,700 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి 2019 ఫిబ్రవరి 15న రూ. 63.50 కోట్లుతో పరిపాలనా ఆమోదం, 2020 జూలై 11న సాంకేతిక ఆమోదం లభించాయి. పెదంకలాం ప్రాజెక్టు కాంట్రాక్టర్లే ఈ ప్రాజెక్టును కూడా దక్కించుకున్నారు. రూ.48.90 కోట్లుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం 2023 ఏప్రిల్‌ 25 నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ కేవలం 21 శాతం పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. ఆ తరువాత 2025 మార్చి 24 వరకు గడువు ఇచ్చినా ఫలితం లేకపోయింది.

పెద్దగెడ్డ

ఈ ప్రాజెక్టు పాచిపెంట మండలంలో ఉంది. ఈ ప్రాజెక్టుకు పాచిపెంట మండలంలో 6,039 ఎకరాలు, సాలూరు మండలంలో 2,839 ఎకరాలు, రామభద్రపురం మండలంలో 3,122 ఎకరాలు మొత్తం 12 వేల ఎకరాలకు సాగునీరందించే సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు ఎం/ఎస్‌ జీవీవీ - వైఎంఎంఆర్‌ (జేవీ) సంస్థలు (హైదరాబాద్‌) రూ.23.83 కోట్లతో ఒప్పందం కుదుర్చున్నాయి. 2023 డిసెంబరు 31 నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు 20 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

గడువు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది

జిల్లాలో ప్రాజెక్టుల ఆధునికీకరణ విషయంలో 2020లో ఇచ్చిన ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం పనులు చేయాలని కాంట్రాక్టర్లను కోరాం. అయితే కొందరు చేయలేమంటున్నారు. దీనిని బట్టి గడువు పొడిగింపు విషయం ప్రభుత్వం తేల్చనుంది. అంగీకరించి ముందుకొస్తే డిసెంబరు నుంచే పనులు ప్రారంభమవుతాయి.

-ఆర్‌.అప్పారావు, ఎస్‌ఈ, నీటి పారుదలశాఖ, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - Nov 23 , 2025 | 11:02 PM