ఆగిఉన్న లారీని ఢీకొన్న మరో లారీ
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:46 PM
ఆగిఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొన్న ఘటనలో క్లీనర్ మృతిచెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
గంట్యాడ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఆగిఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొన్న ఘటనలో క్లీనర్ మృతిచెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గంట్యాడ మండలంలోని రామవరం గ్రామ సమీపంలో జాతీయ రహ దారిపై చోటుచేసుకుంది. గంట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో విశాఖపట్టణం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న ఓ లారీ టైర్ పంచర్ కావడంతో రామవరం హైవేపై బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కనే నిలిపివేశారు. దీని వెనుకన మరో లారీని నిలిపివేశారు. అయితే అదే దారిలో అతి వేగంగా వస్తున్న లారీ.. ముందు ఉన్న లారీని ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రెండో లారీలో క్లీనర్‌గా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన కోన వెంకటరమణ క్యాబిన్‌లో ఇరుక్కునిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అదే లారీలో ఉన్న డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సాయికృష్ణ తెలిపారు.