Share News

Another chance! మరో చాన్స్‌!

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:47 PM

Another chance! వారి పరిస్థితి తెలుసుకుంటున్న అధికారులు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకానికి ఇప్పటివరకు దరఖాస్తు చేయలేని వారికి, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారికి ఉపశమనం. దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకూ ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి గత నెల 30తోనే గడువు ముగిసింది కానీ దరఖాస్తుదారుల విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Another chance! మరో చాన్స్‌!
క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు తెలుసుకుంటున్న సిబ్బంది

మరో చాన్స్‌!

పీఎం ఆవాస్‌ యోజన 2.0 దరఖాస్తు గడువు పెంపు

ఈ నెల 14 వరకూ అవకాశం

ఇదివరకే లబ్ధిపొందారంటూ కొన్ని తిరస్కరణ

వారి పరిస్థితి తెలుసుకుంటున్న అధికారులు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకానికి ఇప్పటివరకు దరఖాస్తు చేయలేని వారికి, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారికి ఉపశమనం. దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకూ ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి గత నెల 30తోనే గడువు ముగిసింది కానీ దరఖాస్తుదారుల విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాజాం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

ఇళ్ల కోసం జిల్లాలో ఇప్పటివరకూ 26,302 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్థలాల కోసం 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది డిమాండ్‌ సర్వేలో ఇళ్ల స్థలాల కోసం 6 వేల మంది, ఇళ్ల కోసం 39 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులను మ్యాపింగ్‌ చేస్తున్న సమయంలో అనేకం తిరస్కరణకు గురవుతున్నాయి. గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందినట్లు, బిల్లులు జమ అయినట్లు చూపుతున్నాయి. వారిలో అర్హులు ఉండడంతో ప్రభుత్వం మరో చాన్స్‌ ఇచ్చింది. 11 రోజుల గడువు లోపు అందరి దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే పూర్తి పారదర్శకంగా, ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

వేలాది దరఖాస్తుల తిరస్కరణ..

గత ప్రభుత్వాల హయాంలో గృహాలు మంజూరైన వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇటువంటి వారు ప్రతిగ్రామంలో పదుల సంఖ్యలో ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేసింది. 2018 వరకూ బిల్లులు బాగానే చెల్లించినా.. అటు తరువాత కేవలం ఖాతాలో రూ.1 మాత్రమే పడింది. వారిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే బిల్లులు రాలేదని ఇప్పుడు దరఖాస్తు చేసి ఉంటే తిరస్కరణకు గురవుతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జగనన్నకాలనీ పేరుతో లబ్ధిదారులకు సెంటున్నర స్థలం ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ చాలామందికి పట్టాలిచ్చి ఆ స్థలాలు ఎక్కడున్నాయో చూపలేదు. అటువంటి వారి దరఖాస్తులు సైతం తిరస్కరణకు గురవుతున్నాయి.

సిబ్బందిపై ఫిర్యాదులు..

గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. పేదల అర్హత పత్రాలను పరిశీలించి ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వీఆర్వోలు వారి లాగిన్లలో వివరాలు నమోదు చేయాలి. అయితే సచివాలయాల్లో వీరు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలున్నాయి. స్థలం కోసం అయితే ముందుగా వీఆర్వోను సంప్రదించాలి. కార్యాలయాల్లో వీఆర్వోలు అందుబాటులో ఉండడం లేదని ఎక్కడికక్కడే ఫిర్యాదులున్నాయి. ఇటీవల ఈ ఫిర్యాదులు ఎక్కువ కావడంతో మండల ప్రత్యేకాధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఓ జిల్లా అధికారి ఇటీవల ఏకకాలంలో సచివాలయాలను సందర్శించగా వీఆర్వోలు ఉండడం లేదని స్పష్టమైంది. ఈ విషయంలో కలెక్టర్‌ ఇటీవల ముగ్గురు సచివాలయ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు. కనీసం ఈ 11 రోజులైనా సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

గడువు పెంపు

ఇళ్ల దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నెల 14 వరకూ అవకాశం ఇచ్చింది. ప్రతి దరఖాస్తునూ ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించాం. ఏ దరఖాస్తునూ తిరస్కరించకుండా నమోదుచేయాలని సూచించాం. వీఆర్వోలతో పాటు సచివాలయ సిబ్బంది విధిగా నిబంధనలు పాటించి కార్యాలయంలో అందుబాటులో ఉండాలి.

- జి.మురళీమోహన్‌, గృహనిర్మాణ శాఖ అధికారి, విజయనగరం

Updated Date - Dec 03 , 2025 | 11:47 PM