KGH కేజీహెచ్‌కు మరో 25 మంది
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:53 PM
Another 25 Members for KGH పచ్చకామెర్ల లక్షణాలతో కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, ఏకలవ్యకు చెందిన విద్యార్థినులు పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా వారిలో ముగ్గరిని ఇప్పటికే విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే శనివారం కూడా మరో 25 మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు.
మరికొందరు పార్వతీపురం నుంచి ఇళ్లకు..
బెలగాం, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): పచ్చకామెర్ల లక్షణాలతో కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, ఏకలవ్యకు చెందిన విద్యార్థినులు పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా వారిలో ముగ్గరిని ఇప్పటికే విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే శనివారం కూడా మరో 25 మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. మరికొంతమంది పరిస్థితి మెరుగవడంతో ఇంటికి పంపించారు. వారి పర్యవేక్షణ బాధ్యతలను వైద్య సిబ్బందికి అప్పగించారు. ప్రస్తుతం 70 మంది వరకూ విద్యార్థినులు జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. విద్యార్థినులు పచ్చ కామెర్లతో అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలుసుకో వడానికి ఇప్పటికే రాష్ట్ర వైద్య బృందం కురుపాం పాఠశాలను పరిశీలించింది. తాగునీరు, ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు అందించనుంది.
నిలకడగా వారి ఆరోగ్యం
కురుపాం,అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జాండీస్ లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని గిరినజ సంక్షేమ గురుకుల కార్యదర్శి ఎం.గౌతమి చెప్పారు. శనివారం ఆమె పాఠశాలను సందర్శించారు. స్వల్ప, తీవ్ర జాండీస్ లక్షణాలన్న 85 మందిలో 22 మంది విద్యార్థినులను విశాఖ కేజీహెచ్‌కు తరలించామని, వారి ఆరోగ్యం మెరుగైందని చెప్పారు. మిగిలిన వారిని అజ్వర్వేషన్ కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో ఉన్నారని ఉంచామన్నారు. పాఠశాలలో కొత్త ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, మరి కొన్ని నెలల పాటు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థినులందరికీ అదనంగా పౌష్టికాహారం అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సికిల్‌సెల్ అనీమియా కేసులపై ప్రత్యే శ్రద్ధ వహిస్తామని తెలిపారు. అనంతరం ఆమె పాఠశాల డైనింగ్, స్టోర్ రూము, వంట గదులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ అనూరాధను విషయం అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో తరచూ శానిటైజ్ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీడీ కృష్ణవేణి ఉన్నారు.