Annadata Sukhibhava రేపే అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:45 PM
Annadata Sukhibhava from Tomorrow అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు ఈ నెల 2న రైతుల ఖాతాల్లో జమకానున్నాయని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. పండగ వాతా వరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబునాయుడు వెల్లడి
పార్వతీపురం, జూలై 31(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు ఈ నెల 2న రైతుల ఖాతాల్లో జమకానున్నాయని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. పండగ వాతా వరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను భాగస్వామం చేయాలి. రాష్ట్రంలో 46.85 లక్షల రైతులను అర్హులుగా గుర్తించాం.. వీరందరికీ అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 వేలు ఖాతాల్లో జమవుతాయి.’ అని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు హాజరుకావాలని సీఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో కె.హేమత తదితరులు పాల్గొన్నారు.
అంతా సిద్ధం
సాలూరు రూరల్: ‘జిల్లాలో అర్హులైన రైతులందరికి అన్నదాత సుఖీభవ పథకం అందించడానికి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికి 702 మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేయలేదు. వీలైనంత వరకు అందరితో ఈకేవైసీ చేయించడానికి సిబ్బంది కష్టబడుతున్నారు.’ అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాబర్ట్‌పాల్ తెలిపారు. కాగా జిల్లాలో 1,19,556 మంది రైతులకు ఈ సాయం అందే అవకాశాలున్నాయి. తొలి విడతగా వారికి రూ. 7 వేలు జమ కానుంది. అన్నదాత సుఖీభవ పథకానికి డీకేటీ, చుక్కల భూములున్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించే వారు, హౌజ్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేనివారు తదితరులు అనర్హులుగా గుర్తిస్తారు. వాస్తవంగా ఏటా పీఎం కిసాన్ సాయం జూన్, జూలై నెలల్లో జమ చేసేవారు. ఈ ఏడాది జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం సైతం నిరీక్షించాల్సి వచ్చింది. మొత్తంగా కేంద్రప్రభుత్వం ఇచ్చే రూ. 6 వేలతో కలుపుకుని కూటమి సర్కారు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలను విడతల వారీగా అందించనుంది.