Anna Canteens పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:04 AM
Anna Canteens to Feed the Poor నాణ్యమైన ఆహారంతో పేదల ఆకలిని తీర్చేందుకే ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని కలెక్టర్ ఏ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి పరిసరాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
పార్వతీపురం/బెలగాం, జూలై 9(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన ఆహారంతో పేదల ఆకలిని తీర్చేందుకే ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని కలెక్టర్ ఏ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి పరిసరాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అందరిలానే లైన్‌లో నిల్చొని స్వయంగా టోకెన్ తీసుకొని అన్నా క్యాంటీన్‌లో భోజనం చేశారు. అక్కడకు వచ్చిన పేదలతో కాసేపు ముచ్చటించారు. ఆహారం, నాణ్యత, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. కేవలం ఐదు రూపాయలకే ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుందన్నారు. పాలకొండ, పార్వతీపురం ప్రాంతాల్లో అన్నాక్యాంటీన్లు ఉండగా.. ఒక వ్యక్తికి రోజుకు రూ.90 అవుతుందని తెలిపారు. పేదల కోసం రూ.15కే ప్రభుత్వం భోజనం అందిస్తుందని వెల్లడించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉన్నారు.
15 నుంచి ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్
బెలగాం : జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. ‘ఈ నెల 30వ వరకు జరిగే పక్షోత్సవాల్లో ప్రజలను కూడా భాగస్వాములుగా చేయాలి. వ్యర్థాలు పారవేయడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగం.. తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలి. కాలువలను శుభ్రం చేయాలి. దోమలు వ్యాప్తి చెందకుండా స్ర్పేయింగ్ చేయించాలి. గ్రామ పారిశుధ్య కమిటీ సమావేశాలను నిర్వహించి.. చేపట్టాల్సిన పనులపై తీర్మానం చేసుకోవాలి. ’ అని తెలిపారు.
పంటల బీమా ప్రీమియం చెల్లించాలి
పార్వతీపురం రూరల్: రైతులు తప్పనిసరిగా పంటల బీమా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ సూచించారు. తుపాన్లు, అకాల వర్షాలు, వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన వారికి ఆర్థికసాయం అందనుందని తెలిపారు. కౌలు రైతులు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు అర్హులన్నారు. వరి పంటకు ఆగస్టు 15లోగా, మొక్కజొన్నకు ఈ నెలాఖరులోగా ప్రీమియం చెల్లించాలన్నారు. పత్తి, అరటి పంటలకు ఈనెల 15 లోగా చెల్లించాలన్నారు. వరి పంటకు ఎకరాకు రూ.800 , మొక్కజొన్నకు రూ.330, అరటికి రైతులు తమ వాటా కింద రూ.152 ప్రీమియం చెల్లించాలని సూచించారు.