Share News

Animal nutrition is difficult! పశు పోషణ కష్టమే!

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:22 AM

Animal nutrition is difficult! వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతుండడం శుభ పరిణామం. అయితే ఆ యంత్రాలు పాడి పశువులకు మాత్రం శాపంగా పరిణమించాయి. ప్రధానంగా వరి నూర్పులు చేపట్టే యంత్రాలతో గడ్డి పూర్తిగా ధ్వంసమవుతోంది. పశువుల మేతకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు.

Animal nutrition is difficult!  పశు పోషణ కష్టమే!

పశు పోషణ కష్టమే!

యంత్రాల వినియోగంతో లభ్యంకాని వరిగడ్డి

ట్రాక్టరు లోడు రూ.5 వేలు పైమాటే

పాడి రైతులపై పెనుభారం

రాజాం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి):

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతుండడం శుభ పరిణామం. అయితే ఆ యంత్రాలు పాడి పశువులకు మాత్రం శాపంగా పరిణమించాయి. ప్రధానంగా వరి నూర్పులు చేపట్టే యంత్రాలతో గడ్డి పూర్తిగా ధ్వంసమవుతోంది. పశువుల మేతకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. దీనివల్ల పాడి పశువుల పెంపకానికి రైతు వేరేగా గడ్డి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ పరిణామంతో లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వరి గడ్డి లభ్యంకాక అయోమయంలో పడుతున్నారు. గతంలో వరి పంటను కూలీలతో మాత్రమే కోయించి సంప్రదాయ విధానంలో నూర్పులు చేసేవారు. మరికొందరు చొప్పలు కట్టించి కొట్టించేవారు. అలా ఽమిగిలిన చొప్పతో ఇళ్ల పైకప్పులు వేసేందుకు వాడుకునేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. చొప్పతో ఇళ్లు నేయడం దాదాపు తగ్గిపోయింది. అదే సమయంలో నూర్పు యంత్రాలతో వరి గడ్డి పూర్తిగా ధ్వంసమవుతోంది. ముక్కుముక్కలైపోతోంది. పశువుల మేతకు ఉపయోగపడడం లేదు. దీనివల్ల గడ్డి దొరకని పరిస్థితి నెలకొంది.

వరిగడ్డి ఉంటేనే..

పశు పోషణలో వరి గడ్డిది ప్రధాన పాత్ర. పశుదాణా రూపంలో ఎన్నెన్నో కొత్తరకాల ఆహారం వచ్చినా పశువులు మాత్రం ఇష్టంగా తినేది వరిగడ్డి మాత్రమే. గతంలో పశువులతో నూర్పులు చేసి గడ్డిని ఏడాదిపొడవునా మేతగా వేసేవారు. నేడు యంత్రాల పుణ్యమా అని వరిగడ్డి మిగలడం లేదు. పశువులకు సరైన ఆహారం దొరకడం లేదు. జిల్లాలో ఆవులు, ఎద్దుజాతి పశువులు 3,77,960 ఉన్నాయి. గేదె జాతి పశువులు 97,845 ఉన్నాయి. జిల్లాలో 1.89 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. అంటే ఏ స్థాయిలో వరి గడ్డి ఉత్పత్తి అవుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ భారీ యంత్రాలతో వరి కోతలు, నూర్పులు చేస్తుండడంతో వరి గడ్డి ఉపయోగపడడం లేదు.

సొమ్ముచేసుకుంటున్న వైనం..

వరి గడ్డికి ఉన్న డిమాండ్‌ను కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టరు లోడు గడ్డిని రూ.4 వేల వరకూ విక్రయిస్తున్నారు. గతంలో లోడు గడ్డి కేవలం రూ.1000 మాత్రమే ఉండేది. ఇప్పుడు నాలుగింతలు పెరిగింది. ఈ ఏడాది రూ.5 వేలుపైబడినా ఆశ్చర్యపోనవసరం లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పాడి రైతులు కొంత పొలంలో సంప్రదాయ కోతలు చేపడుతున్నారు. తరువాత నూర్పులు చేసి గడ్డిని మిగుల్చుకుంటున్నారు. అయితే పాడి రైతుల్లో ఎక్కువ మంది భూములు లేనివారు ఉన్నారు. అటువంటి వారు వరిగడ్డి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. పశుదాణా కోసం ప్రత్యేకంగా విత్తనాలు వేసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వరిగడ్డి లేకపోవడంతో ఆ ప్రభావం పుట్టగొడుగుల పెంపకంపైనా పడుతోంది.

పెరిగిన ధర

ప్రస్తుతం వరిగడ్డి పశువులకు సరిపడేంతగా లభ్యం కావడం లేదు. అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గతంలో ట్రాక్టరు లోడు రూ.1000కి లభించేది. ఇప్పుడు రూ.5 వేల వరకూ పలుకుతోంది. భారమైనా తప్పడం లేదు.

- శాసపు రాజేష్‌కుమార్‌, పాడిరైతు, రాజాం

చాలా భారం

పశుపోషణ భారంగా మారుతోంది. దాణా ధరలు సైతం పెరిగాయి. వరి గడ్డి అందుబాటులో ఉంటేనే పశుపోషణ సాధ్యమయ్యేది. ఇప్పడు దాణాతో పాటు పశుగ్రాసం ధర కూడా పెరుగుతుండడం ఇబ్బందికరంగా మారింది. ఇలా అయితే పశువులను పోషించలేం. గిట్టుబాటు కూడా కాదు.

- గార గున్నంనాయుడు, పాడి రైతు, రాజాం

------------------

Updated Date - Dec 11 , 2025 | 12:22 AM