Share News

MSME Park నియోజకవర్గానికొక ఎంఎస్‌ఎంఈ పార్క్‌

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:01 AM

An MSME Park for Every Constituency జిల్లాలోని ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్‌ సిద్ధం కావాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గడువును నిర్దేశించుకొని ఆ సమయంలోగా వాటిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా నుంచి పది వేల మంది వ్యాపారవేత్తలు రావాలన్నారు.

 MSME Park  నియోజకవర్గానికొక ఎంఎస్‌ఎంఈ పార్క్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్‌ సిద్ధం కావాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గడువును నిర్దేశించుకొని ఆ సమయంలోగా వాటిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా నుంచి పది వేల మంది వ్యాపారవేత్తలు రావాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. పీఎం ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం మరింత బాగా జరగాలని ఆదేశించారు. ముందుగా అర్హత కలిగిన గ్రూప్‌లను ఎంపిక చేయాలని, వ్యాపారాలను గుర్తించి అందుకు తగిన విధంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డిగ్రీ, ఇంటర్‌ పాస్‌ వారితో పీఎంఈజీపీ శిక్షణ కోసం దరఖాస్తులు పెట్టించాలన్నారు. జిల్లాలో మలేరియాను పూర్తిగా అరికట్టాలని జిల్లా వైద్యాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వారానికి ఒకసారి విధిగా డ్రైడే నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్‌ ఎంవీ కరుణాకర్‌, డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీఎంవో మణి తదితరులు పాల్గొన్నారు.

రహదారులపై చెత్త కనిపించరాదు

సాలూరు మున్సిపాలిటీలోని రహదారులపై చెత్త కనిపించరాదని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. సాలూరులో నిరంతరం తాగునీరు సరఫరా ఉండాలని, ట్యాంక్‌లను సమయానుకూలంగా శుభ్రపరచాలని సూచించారు. పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం రహదారులు, అన్నా క్యాంటీన్‌ తదితర వాటిపై సమీక్షించారు. నెడ్‌క్యాప్‌ వారితో మాట్లాడి సోలార్‌ లైట్స్‌ వేయించాలన్నారు. సూర్యఘర్‌ యూనిట్ల ర్పాటుపై ఆరా తీశారు. మున్సిపల్‌ కార్యాలయానికి అవసరమైతే ఎలక్ర్టికల్‌ ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలన్నారు. రోడ్లుపై ఉన్న పాడైన వాహనాలకు సంబంధించి నోటీసులు అందించాని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ రత్నకుమార్‌ తదితరులున్నారు.

ఆదికర్మ యోగి అభియాన్‌కు పిలుపు

న్యూఢిల్లీ విజ్ఞాన్‌ భవనంలో ఈ నెల 17న జరగనున్న ఆదికర్మ యోగి అభియాన్‌ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పాల్గొనున్నారు. ఈ మేరకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. గిరిజనుల ఉపాధిలో నూతన విధానాలపై కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

Updated Date - Oct 16 , 2025 | 12:01 AM